న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.75.36 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అమ్మకాల పరిమాణం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందిన కారణంగా లాభాలు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
కంపెనీ గతేడాది క్యూ2లో రూ.75.82 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఇదే రెండో క్వార్టర్‌లో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1,223.71 కోట్ల నుంచి రూ.1,436.43 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,348.72 కోట్లుగా ఉన్నాయి. అమ్మకాల పరిమాణం 3.11 మిలియన్ టన్నులుగా నమోదైంది.
గతేడాది సెప్టెంబర్ క్వార్టర్ మొత్తం అమ్మకాలు 2.71 మిలియన్ టన్నులుగా మాత్రమే ఉన్నాయి. 2025 సెపె్టంబర్ 30 నాటికి కంపెనీకి నికరంగా రూ.3,231 కోట్ల అప్పులున్నాయి. ‘‘2025 జూన్ 30 నాటి రూ.4,566 కోట్ల రుణాలతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణతో ఇది సాధ్యమైంది’’ అని కంపెనీ పేర్కొంది. ఇటీవల ఎక్స్చేంజీల్లో లిస్టయిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇది రెండోసారి.


