ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ–కామర్స్ (నైకా మాతృ సంస్థ) సెప్టెంబర్ క్వార్టర్‌లో పటిష్ట పనితీరు నమోదు చేసింది. లాభం రూ.34.4 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10 కోట్లతో పోల్చి చూస్తే మూడింతలైంది. ఆదాయం 25 శాతం పెరిగి రూ.2,346 కోట్లకు చేరుకుంది.
క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,875 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే లాభం 47 శాతం, ఆదాయం 9 శాతం చొప్పున పెరిగాయి. స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ) 30 శాతం పెరిగి రూ.4,744 కోట్లకు చేరింది. వివిధ విభాగాల్లో వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు నైకా వ్యవస్థాపకురాలు, సీఈవో ఫాల్గుణి నాయర్ తెలిపారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో 19 కొత్త స్టోర్లను ప్రారంభించినట్టు, దీంతో తమ ఓమ్ని ఛానల్ నెట్‌వర్క్ (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) మరింత బలపడినట్టు చెప్పారు. ఫ్యాషన్ విభాగం జీఎంవీ 37 శాతం పెరిగి రూ.1,180 కోట్లుగా, బ్యూటీ జీఎంవీ 28% పెరిగి రూ.3,551 కోట్లుగా ఉన్నాయి.
కలిసొచ్చిన కత్రినా, రిహన్నా యాడ్స్
త్రైమాసిక ఫలితాలు నైకా తన ప్రధాన సౌందర్య వ్యాపారాన్ని రెట్టింపు చేయడం ద్వారా లాభదాయకతపై దృష్టి పెట్టినట్లు చూపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హాలీవుడ్ బ్యూటీ రిహన్నా చేసిన యాడ్స్ కలిసొచ్చాయి. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడం, ఆఫ్ లైన్ ఉనికిని విస్తరించడం వంటి బ్రాండ్ ఉత్పత్తుల అమ్మకానికి దోహదపడ్డాచయి.


