 
													దేశ స్టార్టప్ వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన నమూనా ఉద్భవిస్తోంది. ఏళ్లుగా నష్టాల్లో కొట్టుమిట్టాడిన డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్లు ఐపీవోలను ప్రారంభించే సమయంలో అకస్మాత్తుగా లాభదాయకంగా మారుతున్నాయి. నాలుగు హై-ప్రొఫైల్ కంపెనీలు మామాఎర్త్, లెన్స్కార్ట్, బోట్, షుగర్ కాస్మెటిక్స్ అన్నీ పబ్లిక్ లిస్టింగ్కి దాఖలు చేసిన ఒక సంవత్సరంలోనే లాభాలను నివేదించాయి.
మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో నష్టాలను నివేదించింది. కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.98.84 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ నవంబర్ 2023 లో షేరుకు రూ.325 వద్ద పబ్లిక్కి వెళ్లింది. నేడు ఇది రూ.271 వద్ద ట్రేడ్ అవుతోంది.
మూడేళ్లుగా నష్టాల్లో ఉన్న కళ్లజోడు కంపెనీ లెన్స్కార్ట్ 2025లో ఉన్నట్టుండి లాభాల్లోకి వచ్చింది. దాని రూ.7,278 కోట్ల ఐపీవోకి ముందు 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.61 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇక నష్టాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న బోట్ కూడా 2025లో లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడే ఐపీవోకి వచ్చేందుకు ప్రణాళిక వేస్తోంది. అలాగే 2023 చివరి వరకు నష్టాల్లో ఉన్న షుగర్ కాస్మెటిక్స్ ఇప్పుడు లాభదాయకంగా ఉంది. 2026లో ఐపీవోను ప్లాన్ చేస్తోంది.
కాగా ఈ నాలుగు కంపెనీలు మరొక లక్షణాన్ని పంచుకుంటున్నాయి. వాటి వ్యవస్థాపకులు షార్క్ ట్యాంక్ ఇండియాషోలో జడ్జ్‌లుగా వ్యవహరించడం గమనార్హం. ఇది వ్యాపార నీతి, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించే టీవీ షో.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
