ఈ-కామర్స్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మీషో లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదిత్ ఆత్రే(34) నికర విలువ మంగళవారం ఒక బిలియన్ డాలర్ మార్కును అధిగమించి.. బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. మీషో షేర్లు ఒక్కసారిగా 13% పెరగడంతో అతని నికర విలువ రూ.9,142.87 కోట్లకు చేరుకుంది. ఐఐటీ ఢిల్లీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఐటీసీ, ఇన్‌మోబీ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన విదిత్ ఆత్రే.. మీషోకు సారథ్యం వహిస్తూ భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు స్ఫూర్తినిస్తున్నారు.
1991లో జన్మించిన విదిత్ ఆత్రే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 2012లో బీటెక్ పూర్తి చేశారు. భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ ఢిల్లీలో చదవడం ఆయనకు బలమైన సాంకేతిక పునాదిని అందించింది. గ్రాడ్యుయేషన్ తరువాత ఆత్రే తన కెరీర్‌ను ఐటీసీ లిమిటెడ్‌లో ప్రారంభించారు. ఆయన జూన్ 2012 నుంచి మే 2014 వరకు చెన్నైలో ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో పనిచేశారు. ఆ తరువాత మొబైల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌మోబీ(InMobi) సంస్థలో జూన్ 2014 నుంచి జూన్ 2015 మధ్య బెంగుళూరులో పనిచేశారు.
మీషో స్థాపన
వృత్తిపరమైన అనుభవాన్ని మూటగట్టుకున్న తర్వాత ఆత్రే పారిశ్రామికవేత్తగా మారాలని నిర్ణయించుకున్నారు. జూన్ 2015 నుంచి ఆయన మీషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) నాయకత్వం వహిస్తున్నారు. మీషోను స్థాపించడంలో, దానిని విజయవంతమైన ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన దూరదృష్టితో భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా జీరో-కమీషన్ మోడల్‌తో విక్రేతలకు, చిరు వ్యాపారులకు ఈ-కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చారు. తన నాయకత్వంలో మీషో వేగంగా ఎదిగింది. దీని ఫలితంగా ఆత్రే ఫోర్బ్స్ 30 అండర్ 30 (ఆసియా & ఇండియా, 2018), ఫార్చ్యూన్ 40 అండర్ 40 (2021) వంటి ప్రతిష్టాత్మక యువ నాయకత్వ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
మీషో డిసెంబర్ 10న స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసి తన ఇష్యూ ధరకు ప్రీమియం వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజున రూ.111 ఐపీఓ ధర కంటే 53% ఎక్కువగా ముగించింది. మంగళవారం, స్టాక్ అసాధారణ ర్యాలీని కొనసాగించి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.193.50 కి చేరుకుంది.
విదిత్ ఆత్రే నికర విలువ
మీషోలో విదిత్ ఆత్రేకు 11.1 శాతం వాటా ఉంది. షేరు ధర రూ.193.50 ఇంట్రాడే గరిష్టానికి చేరుకోవడంతో ఆయన వాటా విలువ రూ.9,142.87 కోట్లుగా ఉంది. అంటే సుమారు 1.005 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ బర్న్వాల్ 31.6 కోట్ల షేర్లతో రూ.6,114.6 కోట్ల విలువైన వాటాను కలిగి ఉన్నారు. మీషో మార్కెట్ క్యాపిటలైజేషన్ పూర్తి ప్రాతిపదికన రూ.85,207.91 కోట్లుగా ఉంది.


