ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా స్పందించారు.
2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్‌డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!
అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది.


