సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితి త్వరలో పెరిగే అవకాశం ఉంది. పదకొండేళ్ల క్రితం తర్వాత మరోసారి ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల సామాజిక భద్రతకి మరింత ధీమా కలగడంతోపాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి అందే ఆర్థిక లబ్ధి కూడా భారీగా పెరగనుంది. వేతన పరిమితిని చివరిసారిగా 2014లో రూ.6,500 నుంచి 15 వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు పెంపుదలపై ఎలాంటి చర్చలు జరగలేదు.
ఈ అంశంపై ఇటీవల పార్లమెంటులో పలువురు సభ్యులు లేవనెత్తగా... అందుకు స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోదు. వాటాదారులతో చర్చించాలి. అంతేకాకుండా కార్మిక సంఘాలు, పారిశ్రామిక సంఘాలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే పెంపు అంశంపై మాత్రం కేంద్రం సానుకూలంగా ఉంది’ అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా వేతన పెంపు అంశం తెరపైకి వచ్చింది.
30వేల వరకు పెంచాలంటున్న సంఘాలు
ఈపీఎఫ్ 1995లో అమల్లోకి వచ్చిన సమయంలో ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.5వేలుగా ఉంది. ఆ తర్వాత 2001లో అప్పటి జీవన వ్యయం, వేతనాల స్థితికి అనుగుణంగా వేతన పరిమితిని రూ.6,500కు పెంచారు. 13 ఏళ్ల తర్వాత దీన్ని రూ.15వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరే వారికి కనీస వేతనం రూ.20వేల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అనివార్యమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన పరిమితి పెంపుతో ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చేస్తారు. అంతేకాకుండా ఈపీఎఫ్ ఉద్యోగుల పొదుపు మరింత పెరుగుతుంది. యాజమాన్యాలపై కొంత భారం పడినప్పటికీ... ఉద్యోగులకు మాత్రం పీఎఫ్‌లో భారీగా పొదుపు ఉంటుందనేది కార్మిక సంఘాల నేతల అభిప్రాయం.
అయితే వేతన పెంపు అంశంపై ఈపీఎఫ్‌ఓ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సీబీటీ సమావేశం ఇప్పటివరకు షెడ్యూల్ కాలేదు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే రెగ్యులర్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


