ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అంటే తెలియని ప్రైవేటు ఉద్యోగులు ఉండరు. దీని పరిధిలో సుమారు 8 కోట్ల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. ఇది కేవలం పదవీ విరమణ పొదుపు సాధనంగానే కాకుండా ఉద్యోగులకు తొలి దీర్ఘకాలిక పెట్టుబడి కూడా. సభ్యులకు సేవలను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ నిబంధనలలో అనేక మార్పులు చేసింది.
ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ నిధుల బదిలీ ప్రక్రియలో సమస్యలు ఎక్కువగా ఉండటంతో, ఈపీఎఫ్‌వో ఇటీవల భారీ మార్పులు చేసింది. ఇప్పుడు బదిలీలు వేగంగా, సులభంగా, ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఇంతకీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి చేసిన తాజా మార్పులు ఏంటో ఈ కింద చూద్దాం..
ఇవి ప్రధాన మార్పులు
ఆటోమేటిక్ బదిలీ
ఇంతకు ముందు ఉద్యోగులు ఫారం 13 ద్వారా మాన్యువల్‌గా బదిలీకి దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే, కొత్త యజమాన్యం చేరిన తేదీని అప్‌డేట్ చేసిన తర్వాత, ఈపీఎఫ్ బదిలీ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో కంపెనీ యాజమాన్యం ప్రమేయం అవసరం లేదు.
ఒకే యూఏఎన్
ఇప్పటి నుంచి ఒక ఉద్యోగికి ఒక్క యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మాత్రమే ఉంటుంది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో కొత్త యూఏఎన్‌ను సృష్టించేందుకు వీలుండదు. దీంతో పాత, కొత్త పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్ ఒకే యూఏఎన్‌కు లింక్ అవుతాయి. తద్వారా ఎక్కువ ఖాతాల విలీనం అవసరం తగ్గుతుంది.
వేగవంతమైన ధృవీకరణ
ఈపీఎఫ్ఓ ఆధార్ ఆధారిత ఈ-సైన్, ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా కంపెనీ యాజమాన్యాల ధృవీకరణను వేగవంతం చేసింది. ఇంతకుముందు 30–45 రోజులు పట్టిన బదిలీలు ఇప్పుడు 7–10 రోజుల్లో పూర్తవుతున్నాయి.
పాస్‌బుక్‌లో కంబైన్డ్ బ్యాలెన్స్
బదిలీ పూర్తయిన తర్వాత పాత ఖాతా “జీరో బ్యాలెన్స్” చూపుతుంది. కొత్త పాస్‌బుక్‌లో పాతది కొత్తది మొత్తం బ్యాలెన్స్ కనిపిస్తుంది. దీంతో ఉద్యోగులు తమ ఖాతాల్లో ఎంత మొత్తం ఉన్నది సులభంగా ట్రాక్ చేయగలరు.
నిష్క్రమణ తేదీ తప్పనిసరి
మునుపటి కంపెనీ యాజమాన్యం ఉద్యోగి నిష్క్రమణ తేదీని అప్‌డేట్ చేయకపోవడం వల్ల బదిలీలు ఆలస్యం కావడం సాధారణం. ఇప్పుడు ఇది తప్పనిసరి. యాజమాన్యం అప్డేట్ చేయకపోతే, ఉద్యోగి ఆధార్ ఓటీపీ ద్వారా తన నిష్క్రమణ తేదీని స్వయంగా ప్రకటించవచ్చు.
బదిలీ సమయంలోనూ వడ్డీ
ఇంతకు ముందు బదిలీ సమయంలో పాత ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ ఆగిపోయేది. ఇప్పుడు బదిలీ పూర్తయ్యే వరకు కూడా వడ్డీ కొనసాగుతుందని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.
ఈ మార్పులతో ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా మారింది. తమ సంస్థల యాజమాన్యాలపై ఆధారపడకుండా ఉద్యోగులు స్వతంత్రంగా తమ పీఎఫ్ నిధులను నిర్వహించగలుగుతున్నారు. ఇది ఉద్యోగ మార్పుల సమయంలో సమయం, ఆందోళన రెండింటినీ తగ్గించి, ఈపీఎఫ్ వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.


