భారత్‌కు వచ్చి హెచ్-1బీ వీసా స్టాంపింగ్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది భారతీయ హెచ్ -1బి వీసా హోల్డర్లు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడి యూఎస్ కాన్సులర్ కార్యాలయాలు హఠాత్తుగా వారి వీసా స్టాంపింగ్ అపాయింట్‌లను రీషెడ్యూల్ చేసింది. దీంతో వాళ్లు తిరిగి తమ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ వీసా రీషెడ్యూళ్లు ప్రధానంగా డిసెంబర్ 15 నుంచి 26వ తేదీల మధ్య స్లాట్ లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. దీనికి క్రిస్మస్ సెలవు సీజన్ ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, అదే సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను కఠినంగా అమలు చేయడం వల్లే ఈ మార్పులు జరిగాయేమో అన్న అనుమానాలు వీసా హోల్డర్లలో ఆందోళనను పెంచుతున్నాయి.
ఇక ఈ పరిణామం వల్ల ప్రభావితులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తున్న హెచ్-1బి ఉద్యోగులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉద్యోగులు పనిచేసే అమెరికాలోని కంపెనీలు కూడా ఉద్యోగుల గైర్హాజరీతో ప్రాజెక్ట్ డెడ్‌లైన్‌లు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


