‘డంకీ రూట్' ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తూ.. రోజుకు సగటున 65 మంది భారతీయులు పట్టుబడుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం గత ఏడాది (2025) జనవరి నుంచి డిసెంబర్ వరకు అమెరికన్ బోర్డర్ అండ్ కస్టమ్స్ విభాగం మొత్తం 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకుంది. గతంతో పోలిస్తే అక్రమ ప్రవేశాలు తగ్గినప్పటికీ.. ఇది పూర్తిగా ఆగలేదు. జో బైడెన్(2024) హయాంలో మొత్తం 85,119 మంది భారతీయులు పట్టుబడ్డారు.
అయితే, ఈసారి గణాంకాల్లో మార్పు కనిపించింది. పట్టుబడిన భారతీయులందరూ ఒంటరి(సింగిల్)గా ప్రయాణిస్తున్నవారే. 2024లో అరెస్టయిన వారిలో దాదాపు 20 వేల మంది తమ కుటుంబంతో కలిసి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా.. కెనడా, మెక్సికో సరిహద్దుల కన్నా ఇప్పుడు టర్కీ-దుబాయ్ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే వారి సంఖ్య పెరిగింది.

సరిహద్దుల వారీగా..
సరిహద్దుల వారీగా గణాంకాలు పరిశీలిస్తే.. కెనడా సరిహద్దులో 6,968, మెక్సికో సరిహద్దుల్లో 1,543, ఇతర నగరాల్లో అత్యధికంగా 15,319 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. టర్కీ-దుబాయ్ రూట్ నుండి నేరుగా విమానాల ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. పర్యాటక వీసాల (Vacation Visa) పేరుతో అమెరికాలోకి వెళ్లి, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోతున్న (Overstay) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2025లో మొత్తం 3,254 మంది భారతీయులను డిపోర్ట్ చేశారు. 2009 తర్వాత ఇదే అత్యధికం.

డంకీ రూట్ అంటే?
విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ఉపయోగించే మార్గాన్నే ‘డంకీ’ రూట్‌గా అంటారు. ఈ పదం.. పంజాబీ వాడుక భాషలో నుంచి వచ్చింది. ప్లానింగ్ లేకుండా ఒకచోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం.. నకిలీ పత్రాలతో షిప్ కంటైనర్లు, వాహనాల సీక్రెట్ కంపార్టుమెంట్లలో దేశ సరిహద్దులు దాటడం అన్నమాట. మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనే కోరిక.. కానీ చదువు, సరైన అర్హతలు లేకపోవడంతో చాలామంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు.
డబ్బు ఆశతో పలువురు ఏజెంట్లకు చిక్కుతున్నారు. వారి మాటలకు ఆకర్షితులవుతున్నారు. సరిహద్దు దాటాక పోలీసులకు దొరికిపోవడంతో వారిని 'ఇమిగ్రేషన్ క్యాంప్' (జైలు)కు పంపిస్తున్నారు. కొన్సి సందర్భాల్లో కోర్టు అనుమతితో వీరు అక్కడ పని చేసుకునే వీలు కలుగుతుంది. 8-10 ఏళ్లలో గ్రీన్ కార్డ్.. ఆ తర్వాత పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఈ కష్టాలను కొందరు భరిస్తున్నారు.

మూడు ప్రమాదకర మార్గాలు:
కెనడా మార్గం:
ముందుగా భారత్ నుండి కెనడాకు టూరిస్ట్ వీసాపై వెళ్తారు. టొరంటో చేరుకున్నాక ఏజెంట్ పిలుపు కోసం హోటళ్లలో వేచి ఉంటారు. అక్కడి నుండి 2,100 కి.మీ దూరంలోని మనిటోబా ప్రావిన్స్‌కు, ఆపై ఎమర్సన్ గ్రామానికి చేరుకుంటారు. ఇది సరిహద్దు ప్రాంతం. ఇక్కడ 40 డిగ్రీల చలిలో, మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ అమెరికాలోకి ప్రవేశిస్తారు

దట్టమైన అడవులు.. ఎడారుల గుండా..
దక్షిణ అమెరికా ద్వారా వెళ్లే ఈ మార్గం అత్యంత భయంకంగా ఉంటుంది. పనామా అడవులు, నదులు, కొండలను దాటాల్సి ఉంటుంది. 2025లో తిరిగి వచ్చిన హర్జీందర్ సింగ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని చెబుతూ.. పనామా అడవుల్లో 10 రోజుల ప్రయాణంలో తినడానికి ఏమీ దొరకలేదని.. దారిలో దాదాపు 40 అస్థిపంజరాలను (మృతదేహాలను) చూశామని తెలిపారు.
కొలంబియా నది మార్గం:
పనామా అడవుల ద్వారా వెళ్లడం ఇష్టం లేని వారు కొలంబియా నుండి 150 కి.మీ పొడవైన నదిని దాటుతారు. నికరాగ్వా నుండి మెక్సికో వరకు పడవల్లో ప్రయాణిస్తారు. ఈ మార్గంలో నదిలోని ప్రమాదకర జంతువుల నుండి ప్రాణాపాయం ఉంటుంది.


