ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్‌గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.
👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.
👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.
👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.
👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.
👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.
👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.
👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.
👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.


