సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో సీఆర్పిఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), ఐటీబీపీ (ఇండో–టిబెటియన్ బోర్డర్ పోలీస్), ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమాబల్)లో కలిపి మొత్తం 3,239 మంది మహిళా సిబ్బంది నియమితులయ్యారు.
2026లో మొత్తం 5,171 పోస్టుల భర్తీ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇటీవల వెల్లడించారు. కానిస్టేబుల్ ర్యాంకులో మహిళా సిబ్బంది నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
అందుకు అనుగుణంగానే సీఆర్పిఎఫ్‌లో 33 శాతం, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీలో 14 నుంచి 15 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సిబ్బందిని నియమిస్తున్నారు. మహిళా సిబ్బందికి సరైన పని వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వారికి ప్రత్యేకంగా బ్యారక్‌లు, టాయిలెట్లు, డ్రెస్ చేంజింగ్ రూంలు, క్రెచ్‌లు, డే కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు ఈ బలగాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల వంటి అంశాల్లో ఫిర్యాదులపై అత్యంత గోప్యత పాటించడంతోపాటు సమస్య పరిష్కరించేలా అంతర్గత వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.


