
లేహ్: ఈ నెల 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్ ప్రతినిధులతో చర్చలు జరపనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సారథ్యంలో ఏర్పాటైన ఉప సంఘం ఢిల్లీలో లేహ్ అపెక్స్ బాడీ(ఎల్‌ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయెన్స్(కేడీఏ) ప్రతినిధులతోపాటు లద్దాఖ్ ఎంపీ మహ్మద్ హనీఫా జాన్‌తో సమావేశం కానుందని ఎల్‌ఏబీ సహాధ్యక్షుడు చెరింగ్ డోర్జె లక్రుక్ ఆదివారం వెల్లడించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చడంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతాయని లక్రుక్ మీడియాకు వివరించారు.
తమను కేంద్రం చర్చలకు ఆహ్వానించడాన్ని ఆయన స్వాగతించారు. చర్చలతో సానుకూల ఫలితం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో ఎల్‌ఏబీ సెప్టెంబర్ 24వ చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారడం. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేయడం తెల్సిందే. కాగా, తనతోపాటు ఎల్‌ఏబీ లీగల్ అడ్వైజర్, అంజుమన్ ఇమామియా అధ్యక్షుడు అఫ్రాఫ్ అలీ బర్చా, కేడీఏ తరఫున మరో ముగ్గురు చర్చల్లో పాల్గొంటారని లక్రుక్ వివరించారు.