సాక్షి, ఢిల్లీ: సంచార్ సాథీ యాప్‌పై విమర్శలు వెల్లువెత్తున్న వేళ కేంద్రం స్పందించింది. సైబర్ మోసాలను నిరోధించేందుకు యాప్ తీసుకొస్తే, ప్రతిపక్షాలు గొంతెందుకు చించుకుంటున్నాయి? అని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రశ్నించారు. ఈ క్రమంలో.. సైబర్‌ఫ్రాడ్ నిరోధించేందుకే యాప్ రూపకల్పన జరిగిందని, అది 100కు వంద శాతం సురక్షితమైందని ప్రకటన చేశారు.
సైబర్ ఫ్రాడ్ నిరోధించేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చాం. అది పూర్తిగా సురక్షితం. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయితే ఇది అన్నింటిలాంటి యాపే. కచ్చితం ఏం కాదు. దీనిని ఉపయోగించడమా?.. లేదా?.. ఆక్టివేట్ చేయడమా ? డీయాక్టివేట్ చేయడమా ? అనేది వినియోగదారుల ఇష్టం. మా పని కేవలం యాప్‌ను అందరికీ పరిచయం చేయడం వరకే. ఇష్టం లేకుంటే వినియోగదారులు యాప్ డిలీట్ చేసుకోవచ్చు అని కేంద్రం తరఫున టెలికాం మంత్రి స్పష్టత ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ యాప్‌ను తప్పనిసరిగా ఫోన్‌ల తయారీ సమయంలోనే ఇన్‌స్టాల్ చేయాలని.. అది యూజర్లు తొలగించడానికి కూడా వీలుగా ఉండకూడదని ఆదేశాలు జారీ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంపై యాపిల్ లాంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. ఇటు వ్యక్తిగత గోప్యత విషయంలోనూ సందేహాలు వెలువెత్తాయి. అదే సమయంలో.. ప్రతీ పౌరుడి మొబైలోకి తొంగిచూడడం సరికాదని, డాటా చోర్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమంటూ విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటనతో ఓ క్లారిటీ ఇచ్చినట్లైంది.


