దేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్న వేళ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం కోసం కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్తగా విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో.. ప్రభుత్వ యాప్ అయిన సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ(డాట్) అన్ని ప్రైవేట్‌గా మొబైల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్‌స్టాల్ చేయాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది.
దీని ప్రకారం మొబైల్ ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. అయితే, ప్రభుత్వ యాప్ ఉండటం పట్ల కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు గోప్యతా హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. తమతో సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంపై మొబైల్ తయారీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యాపిల్, శామ్‌సంగ్, షియోమీ వంటి సంస్థలు యాప్‌పై స్పందించలేదు. సెల్‌ఫోన్లను విక్రయించడానికి ముందే ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడాన్ని సాధారణంగా యాపిల్ కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇది యాపిల్ సంస్థతో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, కేంద్రం తీసుకువచ్చిన సంచార్ సేథీ యాప్‌ను డిలీట్ చేయలేని విధంగా తప్పనిసరి చేయడం అంటే గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది వినియోగదారుల స్వేచ్ఛను తగ్గిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై డిజిటల్ హక్కుల సంఘాలు సైతం స్పందిస్తూ.. నెటిజన్లపై ఇది అధిక నియంత్రణగా అభివర్ణిస్తున్నారు. వినియోగదారులు తమ పరికరంపై పూర్తి నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడనుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
కాగా, సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించడమేనని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫోన్లలో ఈ యాప్ ఉండటం వల్ల అది ఫోన్ ట్యాపింగ్‌కు కూడా సహాయపడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో యాప్ విషయంలో కేంద్రం ఏదైనా సవరణ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
సైబర్ సెక్యూరిటీ అంటే?
స్మార్ట్ ఫోన్ సైబర్ సెక్యూరిటీ అంటే మీ మొబైల్ పరికరాన్ని హ్యాకింగ్, మాల్‌వేర్, ఫిషింగ్, డేటా లీక్‌ల నుండి రక్షించడం. ఇది వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఫోటోలు, కాంటాక్టులు వంటి డేటా సురక్షితంగా ఉండేందుకు కీలకం.
సెక్యూరిటీ చిట్కాలు
బలమైన పాస్‌వర్డ్‌లు, బయోమెట్రిక్ లాక్‌లు (ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ) వాడటం ముఖ్యం.
మల్టీ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (MFA) ఉపయోగించి బ్యాంకింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలను సేఫ్‌గా చూసుకోండి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్ చేయండి.
పాత వెర్షన్లు హ్యాకర్లకు సులభంగా లక్ష్యం అవుతాయి.
పబ్లిక్ Wi-Fi వాడేటప్పుడు VPN ఉపయోగించండి.
అనుమానాస్పద లింకులు లేదా యాప్‌లు డౌన్‌లోడ్ చేయకండి.
యాంటీ-వైరస్ లేదా మొబైల్ సెక్యూరిటీ యాప్‌లు వాడటం ద్వారా మాల్వేర్ దాడులను నివారించవచ్చు.
ఎందుకు ముఖ్యమైంది?
స్మార్ట్ ఫోన్‌లు ఇప్పుడు వాలెట్, వర్క్‌స్టేషన్, వ్యక్తిగత అసిస్టెంట్‌లా మారాయి. బ్యాంకింగ్, ఆరోగ్య సమాచారం, వ్యక్తిగత ఫోటోలు ఇవన్నీ ఒకే పరికరంలో ఉండటం వల్ల సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారాయి. సైబర్ క్రైమ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఫొటోలు మార్ఫింగ్ చేయడం పెరిగింది.
అయితే ఈ సంచార్ సాథి యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించింది. అప్పటి నుంచి.. ఈ సంచార్ సాథి యాప్ ద్వారా 37 లక్షలకు పైగా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేశారు. ఈ యాప్ ఇప్పటికే పోగొట్టుకున్న 7 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేయడంలో సహాయపడింది. ఇక, ఫోన్‌లో ఈ యాప్ ఉండటం వల్ల దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను కేంద్ర రిజిస్ట్రీ ద్వారా బ్లాక్ చేయవచ్చు.


