శ్రీనగర్: కశ్మీర్ లోయలో ప్రకృతి అసాధారణ పరిణామం చెందింది. ఎత్తైన ప్రాంతాల్లో రాత్రిపూట మంచు కురవడంతో, ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయనే అంచనాలకు భిన్నంగా, ఈ నెలలో తొలిసారిగా కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు ఫ్రీజింగ్ పాయింట్ (సున్నా డిగ్రీలు) కంటే పైకి పెరిగాయి. ఈ అసాధారణ పరిణామం వల్ల.. చలి తీవ్రత నుంచి లోయవాసులకు కాస్త ఉపశమనం లభించిందని అధికారులు ఆదివారం తెలిపారు.
దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ పెంపు
శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఇది మైనస్ 2.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అంటే, ఒక రోజులో దాదాపు ఐదు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగింది. వాతావరణ శాఖ ప్రకారం, ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రత ఈ సీజన్‌కు ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే 3.2 డిగ్రీలు ఎక్కువ. జమ్మూ కశ్మీర్‌లో పుల్వామా మాత్రమే మైనస్ 2.7 డిగ్రీల సెల్సియస్‌తో.. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసిన ఏకైక ప్రాంతంగా నిలిచింది.
మంచు కురిసిన ప్రాంతాలు
గందర్బల్ జిల్లాలోని జోజిలా పాస్, మినామర్గ్, బాల్టాల్ ప్రాంతాలు సహా బందిపోరా జిల్లాలోని తులైల్ ప్రాంతాల్లో మంచు కురిసినట్లు అధికారులు తెలిపారు.
‘చిల్లై కలాన్’ ముంగిట కశ్మీర్
డిసెంబర్ 21న ప్రారంభమయ్యే 40 రోజుల అతి తీవ్రమైన చలికాలంగా పరిగణించే ’చిల్లై కలాన్’ వైపు కశ్మీర్ అడుగులు వేస్తోంది. ఈ సమయంలోనే మంచు కురిసే అవకాశాలు అత్యధికంగా ఉండి, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. అయితే, ’చిల్లై కలాన్’ మొదలయ్యే డిసెంబర్ 20–21 తేదీలలో లోయలో అక్కడక్కడా తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంచు కురిసినా పెరగని చలి ∙కశ్మీర్‌లో ప్రకృతి అసాధారణ మార్పు


