మంచుకొండల్లో ‘సెగలు’ | Mountains Experience Warming 50 Percent Faster Than Global Average | Sakshi
Sakshi News home page

మంచుకొండల్లో ‘సెగలు’

Dec 3 2025 6:02 AM | Updated on Dec 3 2025 6:02 AM

Mountains Experience Warming 50 Percent Faster Than Global Average

విపరీతంగా వేడెక్కుతున్న హిమాలయాలు 

ప్రపంచ సగటు కంటే 50 శాతం ఎక్కువ 

అన్ని పర్వతాలదీ అదే పరిస్థితి అని పేర్కొన్న అధ్యయనం 

100 కోట్ల మందికి నీటి కటకట తప్పదు! 

అరుదైన వృక్ష, జంతుజాలం కనుమరుగే

న్యూఢిల్లీ: ఇవి భూమికి నిజంగానే డేంజర్‌ బెల్స్‌! మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు కనీసం 50 శాతం ఎక్కువగా వేడెక్కుతున్నాయట. 1950 నుంచీ ఈ ధోరణి వేగం పుంజుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకంగా 100 కోట్ల మంది విషయంలో ఇది ప్రాణాంతక పరిణామాలకు దారి తీయగలదని అది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా 1980 నుంచి 2020 మధ్య 40 ఏళ్లలో సమతల ప్రాంతాలతో పోలిస్తే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శతాబ్దానికి సగటున 0.21 డిగ్రీల చొప్పున అధిక వేడిమి నమోదైంది.

అలాగే వాతావరణం పొడిబారడం 11.5 మి.మీ. ఎక్కువగా జరిగింది. ఇక మంచు కరిగే వేగం శతాబ్దానికి ఏకంగా 25.6 మి.మీ. చొప్పున పెరిగిపోయింది! వెన్నులో చలి పుట్టించే ఈ అధ్యయన వివరాలను జర్నల్‌ నేచర్‌ రివ్యూస్‌ అర్త్‌ అండ్‌ ఎన్వైరాన్‌మెంట్‌లో ప్రచురించారు. 

బృందంలో మనవాళ్లు కూడా.. 
పరిశోధన బృందంలో భారత్‌ నుంచి ఉత్తరాంచల్, జవహర్‌లాల్‌ వర్సిటీలకు చెందిన పరిశోధకులు కూడా భాగస్వాములుగా ఉండటం విశేషం. యూరప్‌లోని ఆల్ఫŠస్‌ మొదలుకుని ప్రపంయచంలోకెల్లా అత్యంత ఎత్తైన ఆసియాలోని టిబెట్‌ పీఠభూమి దాకా పర్వత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన వేడిమి గణాంకాలను వాళ్లు ప్రత్యేకంగా విశ్లేíÙంచారు. ప్రధాన పరిశోధనలో వెల్లడైన ప్రమాదకర వాస్తవాలనే వారి విశ్లేషణ కూడా ధ్రువీకరించం విశేషం. ‘‘ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మందికి పైగా ప్రజలు తమ తాగు, సాగు అవసరాలకు హిమానీనదాలు, మంచు కొండల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడ్డారు. వారి పరిస్థితి త్వరలోనే అతి దుర్భరంగా మారనుంది.

అంతేకాదు, వీటి తాలూకు భయానక విపరిణామాలు కేవలం కొండ ప్రాంతవాసులకే పరిమితం కాబోవు. మైదాన ప్రాంతాలు కూడా ఇప్పటికే వాటిని చవిచూస్తున్నాయి. ఈ ధోరణి మున్ముందు మరింత వేగం పుంజుకుంటుంది’’అంటూ వారు భవిష్యద్దర్శనం చేశారు. ‘‘ముఖ్యంగా హిమాలయాల్లో మంచు మనం భావిస్తున్న దానికంటే కూడా శరవేగంగా కరిగిపోతోంది. ఇది భయానక వరదలకు, ఆ వెంటనే ఊహాతీతమైన కరువులకు దారితీయవచ్చు. పర్వత ప్రాంతాల్లోని పలు అరుదైన వృక్ష, జీవజాలం శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులు కూడా చాలా దగ్గర్లోనే ఉన్నాయి’’అంటూ హెచ్చరించారు.  

మంచు కరగడమే కారణం! 
బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌ వర్సిటీ నిపుణుల సారథ్యంతో కూడిన అధ్యయన బృందం ఈ పరిశోధన జరిపింది. ఎత్తు ఆధారిత వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా భూమిపై పడే రేడియో ధార్మికతతో పోలిసే ఉపరితలం నుంచి పైకి అది ప్రతిఫలించే రేటు, గాల్లో తేలాడే ఘన కణాల సాంద్రత తదితరాలను లెక్కగట్టింది. ఆర్కిటిక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాలన్నీ మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా వేడెక్కుతూ వస్తున్నట్టు లెక్కగట్టింది. అక్కడ మంచు విపరీతంగా కరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణమని అధ్యయన బృంద సారథి నిక్‌ పెపిన్‌ చెప్పుకొచ్చారు. ‘‘ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో గాల్లో పైకి పయనించే ఘన కణాల సాంద్రత మంచు కరిగే వేగాన్ని మరింత పెంచేస్తోంది. ఇది నిజంగా ఆందోళనకర పరిణామమే’’అని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement