సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు | Indian Army deployed indigenous monorail system at 16000 feet | Sakshi
Sakshi News home page

సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు

Nov 15 2025 9:29 PM | Updated on Nov 15 2025 9:32 PM

Indian Army deployed indigenous monorail system at 16000 feet

భారత సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తున్న సైనికులకు అండగా ఇండియన్‌ ఆర్మీ మోనోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 16,000 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులకు ఆహారం, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ సిస్టమ్ ద్వారా గజరాజ్ కార్ప్స్(భారత సైన్యానికి చెందిన ఎత్తయిన ప్రాంతం)లోని సైనికులకు సర్వీసు అందిస్తున్నారు.

కఠినమైన వాతావరణంలో..

సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో కమెంగ్ హిమాలయాల్లో ఈ మోనోరైలును ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రాంతంలోని శిఖరాలు, అనూహ్య వాతావరణం, హిమపాతం కారణంగా సరఫరా మార్గాల్లో తరచుగా అంతరాయాలు ఏర్పడేవి. దాంతో సైనికులకు ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యను పరిష్కరించేలా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

గతంలో ఆహార రవాణా ఎలా జరిగేది?

కొత్త మోనోరైల్ వ్యవస్థ రాకముందు కొండలపై ఉన్న సైనికులకు ఆహారం, ఇతర సామగ్రిని అందించడం అనేది అత్యంత కష్టతరమైన పనిగా ఉండేది. చాలా సందర్భాల్లో సైనికులు లేదా స్థానిక కూలీలు తమ వీపులపై భారీ సంచులను మోసుకుని మంచుకొండలపై నడుస్తూ ప్రయాణించేవారు. ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల రవాణా కష్టం అయ్యేది. అత్యంత కీలకమైన సామగ్రిని మాత్రమే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసేవారు. అయితే, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు హెలికాప్టర్లు ఎగరడం అసాధ్యం అవుతుంది.

మోనోరైల్ వ్యవస్థ

గజరాజ్ కార్ప్స్‌కు ఈ మోనోరైలు అవసరాన్ని గుర్తించి పరిష్కారాన్ని రూపొందించారు. ఈ రైలు 300 కిలోల బరువును మోయగలదు. మందుగుండు సామగ్రి, రేషన్ (ఆహారం), ఇంధనం, ఇంజినీరింగ్ పరికరాలు వంటి అవసరమైన సామగ్రి నిరంతరాయంగా, సురక్షితంగా మారుమూల పోస్టులకు చేరవేస్తున్నారు. దీన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా పనిచేయడానికి తయారు చేశారు. వడగండ్లు, తుపానులు వంటి వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని ఇది పనిచేయగలదు.

ఇదీ చదవండి: ఏడు పవర్‌ఫుల్‌ ఏఐ టూల్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement