ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ అసలు రంగు బయట పడింది. లోన లొటారం పైన పటారం అన్న చందంగా ఇన్ని రోజులు ఆపరేషన్ సిందూర్‌పై పాక్ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బొక్కబోర్లాపడ్డారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైన్యం బంకర్లలో దాక్కున్నారని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడే ఒప్పుకోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేసింది. ఈ సందర్బంగా భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం బంకర్లలో దాక్కున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లారు. నన్ను కూడా బంకర్లలో దాక్కోవాలని సలహా ఇచ్చారు. కానీ, నేను అలా చేయలేదు అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌ను పాక్ సైన్యం ధీటుగా ఎదుర్కొందని భారత్ యుద్ధ విమానాలనే కూల్చివేసినట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా జర్దారీ వ్యాఖ్యలతో పాక్ నేతలు, అధికారుల గాలి తీసినట్టు అయ్యింది.
#BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj
— upuknews (@upuknews1) December 28, 2025
కాగా, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమవుతోంది. ఆపై అధ్యక్షుడు జర్దారీ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్ బలహీనమైన స్థితిని హైలైట్ చేస్తుంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అప్పులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక సైనిక సంసిద్ధతకు సామర్థ్యం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్ సైన్యం బంకర్లలో దాక్కోవడం దాని అంతర్గత అభద్రతా భావాన్ని, ఒత్తిడిని బహిర్గతం చేసింది.
భారత్ దాడులు..
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచ్చింది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది.


