మెజారిటీ ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా లేరని.. పక్కాగా పని చేస్తాయని నమ్ముతున్నారని కర్ణాటక నుంచి ఒక సర్వే విడుదలైంది. అయితే.. ఈ ఫలితం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం ప్రజాభిప్రాయంతోనే బయటపడిందని ఎద్దేవా చేస్తోంది. ఈ తరుణంలో ఆ సర్వేకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది.
2024 లోక్‌సభ ఎన్నికలపై నిర్వహించిన ఈ సర్వేలో.. 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసించదగినవేనని వెల్లడించారు. కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ దీనిని నిర్వహించింది. అయితే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అనుమతితో తాము సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ ప్రకటించుకుంది. అయితే..
ఈ సర్వేతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి ప్రిియాంక్ ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని, నిర్వహించాలని ఆదేశించమూ లేదని పేర్కొన్నారు. పైగా సర్వేపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ‘‘మొదటగా చెప్పేది ఏంటంటే.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాదు. రెండోది.. ఈ సర్వేను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఎన్జీవో సమన్వయంతో నిర్వహించింది. అయితే..
ఆ ఎన్జీవోను నడిపే వ్యక్తి.. ప్రధాని కార్యాలయానికి దగ్గరగా పనిచేసే వ్యక్తి. ప్రధాని కోసం అతగాడు ఓ పుస్తకం కూడా రాశాడు. వీటికి తోడు.. సుమారు 110కి పైగా నియోజకవర్గాల్లో కేవలం 5,000 మందిని మాత్రమే సర్వే చేసినట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ డేటాను ఎంత నమ్మొచ్చు?.. ఇంతకు మించి ఏం ఆశించొచ్చు’’ అని ప్రశ్నించారాయన. ఈ సర్వేను విశ్వసనీయంగా భావించడం లేదని.. దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని అన్నారాయన.
ఈ ఫలితం ఆధారంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ.. కలబుర్గి, అలంద్ ప్రాంతాల్లో జరిగిన ఓటు చోరీపై మాత్రం ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదని ప్రియాంక్ ఖర్గే మండిపడ్డారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీ, బీజేపీలు కలిసి కలిసి పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు చేశారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఓట్‌చోరీ రాజకీయం ప్రదానంగా కర్ణాటక నుంచే నడుస్తోంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసిపోయి ఎన్నికల్లో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని విమర్శిస్తున్నాయి. అలాగే ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసీ పారదర్శకతను శంకించాల్సిన పని లేదని బీజేపీ.. కాంగ్రెస్ చేస్తున్నవి ఉత్త ఆరోపణలేనని ఈసీ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి.
ఒక్క ఓటు తొలగిస్తే రూ.80!
కర్ణాటకలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో.. ఓ డేటా ఎంట్రీ టీమ్‌కు లక్షల్లో రూపాయలు చెల్లించి ఓటర్లను తొలగించే పని అప్పగించారని అనుమానాలు నెలకొన్నాయి. ఆరుగురు వ్యక్తుల ముఠా ఈ స్కామ్ నడిపించిందని.. ఒక్క ఓటర్‌ను తొలగించడానికి రూ.80 ఛార్జ్ చేశారని.. అలా 2023 రాష్ట్ర ఎన్నికల ముందు సుమారు 7,000 ఓటర్లను తొలగించమని అభ్యర్థనలు వచ్చాయని అక్టోబర్ నాటి దర్యాప్తులోనే వెల్లడైంది.
తాజా ‘సర్వే లొల్లి’ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. మేము ఎప్పటినుంచో చెబుతున్నదే నిజమని తేలింది. 2023 ఎన్నికల ముందు అలంద్ నియోజకవర్గంలో 6,000కి పైగా నిజమైన ఓటర్లను డబ్బు చెల్లించి తొలగించారు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.


