ఆస్ట్రేలియాకు 27 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ..! | 30 Congress MLAs for Australia Tour | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు 27 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ..!

Feb 17 2026 11:05 AM | Updated on Feb 17 2026 11:31 AM

30 Congress MLAs for Australia Tour

నేడు ఆస్ట్రేలియాకు పాతిక మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

అంతా సీఎం సిద్ధరామయ్య వర్గీయులే? 

మార్చి 1న తిరిగి బెంగళూరుకు రాక 

సీఎం, డీసీఎం వర్గాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం    

 

సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో అధికార మార్పిడి సంఘర్షణ ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య నెలకొన్న నాయకత్వ పోరు కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో టూర్‌ పాలిటిక్స్‌కు తెరలేచింది. సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్‌కు పయనమవుతుండడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

 మంగళవారం రాత్రి పాతిక మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి ఆ్రస్టేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారేనని సమాచారం. వీసా లభించని కారణంగా కొందరు ఎమ్మెల్యేలు పర్యటనను రద్దుచేసుకున్నారు. హైకమాండ్‌ ఆగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశంతో పలువురు టూర్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరికొందరు డైలమాలో ఉన్నారు. ఇంకొందరు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ రాజకీయంగా అపోహలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ గందరగోళం మధ్య మంగళవారం రాత్రి సుమారు 27 మంది పయనమవుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మార్చి 1న బెంగళూరుకు తిరిగి రానున్నారు. కాగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బయల్దేరుతున్నట్లు చెబుతున్నారు. అయితే, పశుసంవర్ధక శాఖ నుంచి ఈ పర్యటన ఖరారైనట్లు వార్తలు రాగా.. ఆ శాఖ మంత్రి కె. వెంకటేశ్‌ వీటిని తోసిపుచ్చారు. కొంతమంది ఇదొక ప్రైవేటు టూర్‌ అని, వ్యక్తిగత ఖర్చులతో విదేశీ టూర్‌కు వెళ్తే తప్పేంటని ప్రశి్నస్తున్నారు.   

రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం.. 
ఇదిలా ఉంటే.. సీఎం కుర్చీ పోరులో అభిప్రాయభేదాలు విడిచి కలసికట్టుగా సాగాలని ఆదివారం రాష్ట్ర నాయకులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. అయితే, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే అని ఆయన కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వర్గం నుంచి కౌంటర్లు వస్తున్నాయి. డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని ఎమ్మెల్యే గణిగ రవికుమార్‌ మద్దతు పలికారు.   

Advertisement
 
Advertisement
Advertisement