కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి | - | Sakshi
Sakshi News home page

కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

కాటేస

కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి

శివాజీనగర: కొంతకాలంగా ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ టీవీ తెర నటి రశ్మి లీలా కన్నుమూశారు. సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆమె మరణించారు. ఆమె భర్త సారక్కి మంజు మరణవార్తను సోషల్‌ మీడియాలో పంచుకొన్నారు. రశ్మి లీలా 2019 నుంచి పల్మొనరీ ఫైబ్రోసిస్‌ అనే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండేవారు. ఆ జబ్బు వల్ల శ్వాసకోశాలు క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. వైద్యనిపుణులు ఔషధాలతో నయం చేయలేకపోయారు. అందుచేత ఊపిరితిత్తులను మార్చాలని నిర్ణయించారు. ఆ మేరకు గత ఫిబ్రవరిలో లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కూడా పూర్తిచేశారు. అయినా ఆమె కోలుకోలేకపోయారు. ఆమె తన ఆరోగ్యం గురించి తరచుగా సోషల్‌ మీడియాలో అభిమానులకు సమాచారం ఇస్తుండేవారు. ఏం భయం లేదు, నువ్వు కోలుకుని కులాసాగా ఉంటావని అభిమానులు భరోసా ఇచ్చేవారు. నా ప్రాణం వెళ్లిపోయిందని భర్త ఆవేదన చెందారు.

స్కూలు బస్సును క్యాంటర్‌ ఢీ

బనశంకరి: దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరు వద్ద సోమవారం ప్రైవేటు స్కూల్‌ బస్‌ ను వెనుక నుంచి మినీ క్యాంటర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో 7 మంది విద్యార్థులకు స్వల్పగాయాలు అయ్యాయి. తలపాడి స్కూల్‌ బస్‌ కాఫీనాడు రహదారిలో స్కూలుకు వెళ్తుండగా చేపల లోడుతో వెళ్తున్న క్యాంటర్‌ ఢీకొనింది. బస్‌ వెనుక భాగం సీట్లు ధ్వంసమయ్యాయి. నలుగురు బాలలు, ముగ్గురు బాలికలు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది బాలలు ఉన్నారు.

పవిత్రకు దక్కని బెయిలు

శివాజీనగర: చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న ప్రథమ నిందితురాలు పవిత్రాగౌడ మళ్లీ నిరాశకు గురైంది. మధ్యంతర బెయిల్‌ కోరుతూ సమర్పించిన పిటిషన్‌ను 57వ సీసీహెచ్‌ కోర్టు జడ్జి ఐ.పీ.నాయక్‌ తిరస్కరించారు. కుమార్తెకు పరీక్షలు ఉన్నందున 20 రోజులు బెయిలు ఇవ్వాలని ఆమె కోరారు. ఇందుకు ప్రభుత్వ వకీలు అభ్యంతరం తెలిపారు. బెయిల్‌ ఇస్తే సాక్షులపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు.

టీవీ చూడొద్దన్నందుకు..

యశవంతపుర: నిరంతరం టీవీ చూడవద్దు, కొంచెం చదువుకో అని తల్లి తిట్టిందనే కోపంలో కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా బసరీకట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. తల్లి బయటకు పనిమీద వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. కూతురు సుప్రీత (13) టీవీ చూస్తూ ఉంది. ఆమె 7వ తరగతి చదువుతుండగా సెలవు కావడంతో ఇంట్లో ఉంది. టీవీ చూడొద్దని, ఇంటిని శుభ్రం చేయాలని చెప్పి తల్లి బయటకు వెళ్లింది. కోపం పట్టలేని సుప్రీత చున్నీతో ఉరి వేసుకొని చనిపోయింది.

కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి 1
1/2

కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి

కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి 2
2/2

కాటేసిన పల్మొనరీ ఫైబ్రోసిస్‌.. టీవీ నటి రశ్మిలీలా మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement