నాన్‌ వెజ్జే నైవేద్యం | - | Sakshi
Sakshi News home page

నాన్‌ వెజ్జే నైవేద్యం

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

నాన్‌

నాన్‌ వెజ్జే నైవేద్యం

బొమ్మనహళ్లి: రామనగర జిల్లాలోని చన్నపట్టణ తాలూకాలోని మంగడహళ్లి గ్రామస్తులు ఆదివారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఆచారం ప్రకారం చన్నప్పాజీ స్వామికి మాంసాహార నైవేద్యం అందించారు. ఆ తర్వాత వందలాది మంది భక్తులు చికెన్‌, మటన్‌ కూరతో భోజనాన్ని ఆరగించారు. చాలా ఏళ్లుగా ప్రతి శివరాత్రికి ఈ ఆచారం కొనసాగుతోందని తెలిపారు. చుట్టుపక్కల పదుల గ్రామాలకు చెందిన భక్తులు వచ్చి పాల్గొంటారని పూజారి చన్నప్ప తెలిపారు. శివరాత్రి రోజున భక్తులు ఏదైనా కోరిక నెరవేరాలని మొక్కుకుంటారు. తరువాత, ఆలయ ప్రాంగణంలో మాంసాహార వంటకాల్ని వండి, భక్తులందరికీ వడ్డిస్తారు. రాత్రి పొద్దుపోయే వరకు భోజనాలు జరిగాయి.

గుంతల రోడ్డు ప్రమాదంలో..

కృష్ణరాజపురం: బెంగళూరులో గుంతల రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కృష్ణరాజపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో 4ఏళ్ల చిన్నారి బాలుడు మరణించాడు. వివరాలు.. ఆదివారం సాయంత్రం కృష్ణరాజపురంలోని గార్డెన్‌ సిటీ కళాశాల సమీపంలో బాలుని కుటుంబం ఉంది. బాలున్ని బంధువు బైక్‌పై కూర్చోబెట్టుకుని మార్గొండనహళ్లి నుంచి కిత్తగనూరుకు వెళుతుండగా రోడ్డుపై ఉన్న గుంత వల్ల కిందపడ్డారు. ఈ సమయంలో వెనుక వస్తున్న కారు వారిని ఢీకొనింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడే మరణించాడు. మరొకరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కొనసాగుతున్న

ఎమ్మెల్యే బైరతి విచారణ

శివాజీనగర: బెంగళూరులో రౌడీ బిక్లు శివకుమార్‌ హత్య కేసులో 5వ నిందితుడు, కేఆర్‌ పురం బీజేపీ ఎమ్మెల్యే భైరతి బసవరాజును సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. డీఎస్పీ గౌతమ్‌, అధికారులు వారంరోజుల కస్టడీకి తీసుకుని సోమవారం కూడా ప్రశ్నించారు. గత ఏడాది జూలై 15న హలసూరు చెరువు సమీపంలో ఇంటి ఎదురుగా నిలబడి ఉన్న బిక్లుని కొందరు కత్తులతో పొడిచి చంపారు. బెయిలు, రియల్‌ ఎస్టేట్‌ గొడవల వల్ల హత్య చేశారని అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదీశ్‌, కిరణ్‌, విమల్‌, అనిల్‌, భైరతి బసవరాజ్‌ తదితరుల మీద భారతీనగర ఠాణాలో కేసు నమోదైంది.

ట్రాక్టర్‌ ఢీకొని టీచరు మృతి

బొమ్మనహళ్లి: వేగంగా వచ్చిన ట్రాక్టర్‌.. స్కూటర్‌ను ఢీకొనడంతో ప్రభుత్వ టీచరు దుర్మరణం చెందింది, ఈ ఘటన బెంగళూరు శివార్లలోని తళి రోడ్డులోని శని మహాత్మా ఆలయం సమీపంలో జరిగింది. ఆనేకల్‌ తాలూకాలోని లక్ష్మీపుర ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు యోగేశ్వరి (40) ఎప్పటిలాగే సోమవారం ఉదయం స్కూటర్‌లో స్కూల్‌కు వెళ్తోంది. ఎదురుగా మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తూ వచ్చిన ట్రాక్టర్‌ ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన యోగేశ్వరి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆనేకల్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. టీచరు మృతితో సహచరులు, విద్యార్థులు తీవ్ర విచారానికి లోనయ్యారు.

నంజన్న సన్నిధిలో

ముప్పూటలా అన్నదానం

మైసూరు: దక్షిణ కాశీగా పేరొందిన జిల్లాలోని నంజుడేశ్వర ఆలయంలో ప్రసాదం ఇకపై 24 గంటలూ పంపిణీ చేస్తారు. ఒకప్పుడు మధ్యాహ్నం మాత్రమే ఆలయ దాసోహ భవన్‌లో భోజనం అందించేవారు. ఇప్పుడు ఉదయం అల్పాహారం, భోజనం, ఆపై రాత్రి భోజనం అందించడానికి ఏర్పాట్లు చేశారు. మలె మహదేశ్వర కొండ దేవస్థానంలో మాదిరిగా అన్నదానం నమూనా రూపొందించారు. స్థానిక ఎమ్మెల్యే దర్శన్‌ ధ్రువ నారాయణ సోమవారం నుంచి అన్నదానాన్ని ప్రారంభించారు. ఉచిత బస్సు వ్యవస్థ కారణంగా ఆలయానికి భక్తులు పెరిగారు. దీంతో వారి క్షుద్బాధను తీర్చడానికి ఖర్చు అయినా మూడుపూట్ల అన్నదానం చేపట్టినట్లు తెలిపారు.

నాన్‌ వెజ్జే నైవేద్యం 1
1/3

నాన్‌ వెజ్జే నైవేద్యం

నాన్‌ వెజ్జే నైవేద్యం 2
2/3

నాన్‌ వెజ్జే నైవేద్యం

నాన్‌ వెజ్జే నైవేద్యం 3
3/3

నాన్‌ వెజ్జే నైవేద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement