మండ్యకోర్టులో..
మండ్య: మండ్య నగరంలోని కోర్టుకు దుండగులు బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపడంతో ఆందోళన నెలకొంది. బాంబు పెట్టారని ప్రచారం సాగడంతో న్యాయవాదులు, ఉద్యోగులు, ప్రజలు ఆదుర్దాతో బయటకు వచ్చారు. పోలీసులు, బాంబు నిర్వీర్యక సిబ్బంది గాలింపు జరిపారు. కోర్టు భవనాల లోపల, బయట, రోడ్ల పక్కన డ్రైనేజీలోనూ వెతికినా పేలుడు వస్తువులు కనిపించలేదు. దీంతో నకిలీ ఈమెయిల్ అని తెలిపారు. ఉదయం 11:15 గంటలకు జిల్లా జడ్జి సుబ్రహ్మణ్య ఈమెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. మీ గదిలో 12 ఆర్‌డిఎక్స్, ఐఈడీ బాంబులను పెట్టాం, అవి త్వరలోనే పేలిపోతాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలును నిలిపివేయాలని మెయిల్‌లో ఉంది. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు జరిపారు. ఈ హడావుడితో రోజంతా కోర్టు విచారణ రద్దయి కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే కక్షిదారులు నష్టపోతారని న్యాయవాదులు వాపోయారు.


