పశ్చిమ గోదావరి: సైకో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్య రాజు) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని చెప్పారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని తెలిపారు.
ఆయన సోమవారం పశి్చమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ చలవ వల్లనే రఘురామకు అధికారయోగం లభించిందని, ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అసహ్యం అయ్యారని విమర్శించారు. ఆయన పక్కన ఉండి వ్యవహారాలు చక్కబెట్టే మరో సైకో కొత్తపల్లి నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎమ్మెల్యేను ఎదిరించి మాట్లాడినా, చెప్పిన మాట వినకపోయినా వారు టీడీపీ, జనసేనకు చెందిన వారైనా సరే అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. అటువంటి వారిలో తాను ఒకడినన్నారు.
నన్ను చంపించేయమన్నారు
కొత్తపల్లి నాగరాజు సహకారంతో తనను చంపించేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని వెంకటేశ్వరరాజు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుపై గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తే.. ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే వెళ్లి శివరామరాజు కార్యాలయం ముందు తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని రచ్చచేసినట్లు చెప్పారు. ఇంత సాయం చేస్తే ఎమ్మెల్యే కార్యాలయంలో తాను, తనతోపాటు ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నిలబడాలని, ఎవరినీ అసలు గౌరవించరని పేర్కొన్నారు. అనుచరుడు నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ బయటపెడతానని చెప్పారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సొసైటీ పదవులు అగ్రవర్ణాలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదేంటని అడిగితే రూ.40 కోట్లు ఖర్చుచేసి గెలిచానని, అవి తిరిగి ఇచ్చేస్తే నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అధిష్టానానికి సైతం చెబుతున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలో అది తగదని చెప్పిన తనను చంపించేయాలని తన కుటుంబసభ్యుల ముందే అనుచరుడు నాగరాజును ఆదేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇప్పుడు కాకపోతే ఏదో ఒకరోజు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చంపించేస్తారన్నారు.
తనను చంపేందుకు దమ్ముంటే రఘురామకృష్ణరాజు రావాలని తొడగొట్టి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దోపిడీ, దౌర్జన్యాలను రికార్డులతో సహా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లకు త్వరలోనే అందిస్తానని చెప్పారు. పేదలంటే రఘురామకృష్ణరాజుకు అసలు గిట్టదని, రోడ్డు పక్కన ఇల్లు కనబడితే చాలు పడగొట్టేయాలని ఆదేశాలు ఇస్తారని చెప్పారు. నియోజకవర్గంలో మత సామరస్యం లేకుండా పోయిందని, చర్చిలు, మసీదులు కూలదోస్తున్నారని చెప్పారు. అవన్నీ రఘురామకృష్ణరాజు ఆదేశాలతోనే జరుగుతున్నాయని వెంకటేశ్వరరాజు పేర్కొన్నారు.


