బాబు పలుకులు ప్రచార ఆర్భాటం.. అర్ధ సత్యాలు మాత్రమే | Kommineni Comments On Chandrababu Lies | Sakshi
Sakshi News home page

బాబు పలుకులు ప్రచార ఆర్భాటం.. అర్ధ సత్యాలు మాత్రమే

Feb 17 2026 11:50 AM | Updated on Feb 17 2026 12:20 PM

Kommineni Comments On Chandrababu Lies

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త డైలాగులతో ప్రజలను భ్రాంతిలో ఉంచడానికి యత్నిస్తుంటారు. అందులో సత్యాసత్యాలతో సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయనగారు 20 నెలల్లో అరవై విజయాలు సాధించారట! టీడీపీ, జనసేనల సంయుక్త ఎన్నికల మేనిఫెస్టోలో 150 హామీలిస్తే వాటిల్లో ఎన్ని అమలు కాలేదో చెప్పలేకపోయారు కానీ అరవై విజయాలని ఢంకా బజాయించేశారు. దీనికి ఈనాడు కూడా తనదైన స్టైల్లో తలూపింది. ఈ క్రమంలోనే ఈ ఎల్లో పత్రిక ఏమని రాసిందంటే.. చంద్రబాబు ప్రస్తావించిన అంశాలను విజయాలని జనం నమ్మాలట.

రాష్ట్ర గవర్నర్ నజీర్ అసెంబ్లీలో చదివిన స్పీచ్‌లో పేదలకు ఏటా రూ.33 వేల కోట్లు నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. కాని ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ రూ.1.5 లక్షల కోట్లు. దీని గురించి వివరణ లేదు. తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం చేశామన్నారు. తల్లుల ఖాతాలో రూ.పది వేల కోట్లు వేశామని చెప్పారు. ఏడాదిపాటు ఎగవేసి, రెండో ఏడు అరకొరగా అమలు చేసిన సంగతి విస్మరించారు.

వాస్తవానికి ఈ స్కీమ్‌కు ఖర్చు చేసింది రూ.ఆరు వేల కోట్ల పైచిలుకే కదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్త్రీ శక్తి ద్వారా 43.51 కోట్ల పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారట. ఇందుకు రూ.1532 కోట్లు వ్యయమైందట. ఈ స్కీమ్ గురించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిందేమిటి? రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఫ్రీగా వెళ్లవచ్చని. కానీ అమలవుతోంది ఏమిటి? బోలెడన్ని ఆంక్షల పెట్టారు. అలాంటప్పుడు ఇది విజయమెలా అవుతుంది? వంచనే కదా?

ఇదే టైమ్‌లో ఈ స్కీమ్‌తో నష్టపోయిన ఆటోల వారికి ఏమైనా సహాయం చేశారా? స్త్రీ శక్తి స్కీమ్ లో అసలైన హామీ ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కదా! ఆ ఊసే ఎత్తకుండా విజయం చేసేశామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి! నిజంగానే ప్రభుత్వం కనుక రూ.1500 రూపాయల స్కీమ్ అమలు చేస్తే కచ్చితంగా విజయంగా గొప్పగా చెప్పుకోవచ్చు. కాని ఆ పరిస్థితి ఉందా! అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రెండువిడతలలో రూ.6300 కోట్లు ఇచ్చారట. చంద్రబాబు ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మాట చెబితే, గవర్నర్ స్పీచ్ లో మాత్రం రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున లబ్ది చేకూర్చుతున్నట్లు చెప్పడం గమనార్హం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికి రెండు విడతలలో ఇచ్చింది పదివేలే అన్నది వాస్తవం! అంటే ఒక్కో రైతుకు 30 వేల రూపాయలు బకాయి పడినట్లే!

ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇందులో కొత్త ఏమి ఉంది? జగన్ టైమ్‌లో మూడువేల చొప్పున పెన్షన్ ఇస్తే, దానిని ఒక వెయ్యి పెంచిన మాట నిజమే. కాని ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదన్నది కూడా పచ్చి నిజం.సుమారు నాలుగు లక్షల మందికి పెన్షన్ కోత పడిందని చెబుతున్నారు. దాని మాట ఏమిటి? రూ.వెయ్యి కోట్లతో రహాదారులను మరమ్మతులు చేశామని చంద్రబాబు చెప్పినా, రాష్ట్రంలో అనేక రోడ్ల దుస్థితిపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి కదా! మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ లు పెట్టడం కూడా విజయమేనట. ఇది గిన్నిస్ రికార్డు అని భుజాలు చరుచుకున్నారు.

ఈ సమావేశాల వల్ల ఏమి లాభం కలిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు తగ్గారో లెక్కలతో సహా వార్తలు వచ్చాయి కదా! మరి అది విజయమా?లేక అపజయమా? ఫీజ్  రీయింబర్స్‌మెంట్ కింద రూ.2600 కోట్లు చెల్లించామని చంద్రబాబు చెప్పుకున్నారు. కాని ఇప్పటికీ సుమారు రూ.ఐదువేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయే. దానిపై విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు కదా!

విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ వస్తోందట. జగన్ టైమ్‌లో వచ్చిన అదాని డేటా సెంటర్‌ను గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు. దీనికి రూ.22వేల కోట్ల మేర ఎదురు రాయితీలు ఇవ్వడం, అయినా వెయ్యి మందికి కూడా ఉపాధి కల్పించడం లేదన్న విషయం బహిర్గతం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నామని చంద్రబాబు తెలిపినా, రూ.40 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ఎన్.జి.ఓ. సంఘం నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిన విజయాలన్నిటిని పరిశీలిస్తే  ఇదంతా ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం అంతగా లేదన్న సంగతి విశ్లేషణలో బయటపడుతుంది. గవర్నర్ స్పీచ్‌లో పీపీపీ విధానం, పీ-4 ,ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేయబోతున్నట్లు, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు ,16 లక్షల ఉద్యోగాలు అంటూ అతిశయోక్తులు, అర్ధ సత్యాలే కనిపిస్తాయి.

ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన అంశాలలో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడవద్దని హెచ్చరించారట. అంటే గత సమావేశాలలో యూరియా కొరత వంటి ప్రజా సమస్యలను కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దానిపై ప్రభుత్వం బాగా ఇరుకున పడింది. ఈసారి అలాంటి విషయాలు చెప్పవద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారా అన్న  సందేహం వస్తుంది.ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వంటి కొద్దిమంది రాష్ట్రంలో ఉన్న దారుణమైన  పరిస్థితుల గురించి పల్లె కన్నీరు పెడుతోందంటూ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం సృష్టించింది.

అసెంబ్లీలో కూడా ఆ సంగతులు  చెబుతారేమో  అన్న భయం టీడీపీ, జనసేన పెద్దలలో ఉన్నట్లు అనుకోవాలి. అయితే  40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని కూడా చంద్రబాబు అన్నారట. అసలు ప్రభుత్వమే సరిగా లేదనుకుంటుంటే, తమ గురించి ఏమి ఉంటుందన్నది ఎమ్మెల్యేల భావనగా ఉందట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ మరోసారి పదిహేనేళ్లపాటు కలిసి ఉంటామని ప్రకటించడం హైలైట్. ఏదో భయం వారిని వెంటాడుతున్నట్లుగా ఉంది.

వచ్చే ఎన్నికలలో గెలుస్తామో,లేదో అన్న సంశయం ఏర్పడుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలలో ఒక ధైర్యం కలిగించడానికి ఇలా మాట్లాడుతున్నట్లు  అనిపిస్తుంది.వైసిపి కులచిచ్చు పెడుతుందని పవన్ కళ్యాణ్ అనడమే విడ్డూరం.కులం పునాదిపైన జనసేన ఏర్పడిందన్న సంగతి, అంతేకాక కులాలకు సంబంధించి గతంలో  తెలిసిందే.కులం ప్రస్తావనపై గతంలో రకరకాల ప్రకటనలు చేసిన వీరు నీతులు చెబుతున్నారు!సూటిగా, సుత్తి లేకుండా తక్కువ టైమ్ లో అసెంబ్లీలో  ప్రసంగం పూర్తి చేయాలని చంద్రబాబు చేసిన సూచన బాగుంది. అదే సలహాను  చంద్రబాబు పాటిస్తే బాగుంది కదా అన్నది కూటమి  ఎమ్మెల్యేల అంతర్గత భావనగా ఉంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది!


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement