మరో దాడి జరిగితే తిప్పికొట్టడానికి చర్యలు
నియంత్రణ రేఖ వద్ద భద్రత కట్టుదిట్టం
పీఓకేలో మూడు సెక్టార్లలో యాంటీ–డ్రోన్ వ్యవస్థల మోహరింపు
రావల్‌కోట్, కోట్లీ, భింబర్‌లో 30కిపైగా సీ–యూఏఎస్‌లు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి.
ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది.
భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్‌కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్‌ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.
శత్రు డ్రోన్లపై నజర్
భారత్‌లోని పూంచ్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న రావల్‌కోట్‌లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు, భింబర్‌లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్‌ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్‌లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది.
ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.
తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు
ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి.


