న్యూఢిల్లీ: భారతదేశ బలాన్ని, సైనిక దళాల శౌర్య పరాక్రమాలను ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన స్వదేశీ ఆయుధాల శక్తిసామర్థ్యాలను ప్రదర్శించామని చెప్పారు. ఆధునిక యుద్ధాలు, సైనిక ఘర్షణలు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాదని, అవి యుద్ధ ట్యాంకులు, తుపాకులతో జరగడం లేదని తెలిపారు. కోడ్స్, క్లౌడ్స్‌తో జరుగుతున్నాయని వివరించారు. సైబర్, ఇన్ఫర్మేషన్ యుద్ధాల గురించి ప్రస్తావించారు. బుధవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లో వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’లో ప్రధానమంత్రి ప్రసంగించారు.
దేశ భద్రత కోసం ఎన్‌సీసీ కేడెట్లు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశవ్యాప్తంగా 75 వేల మందికిపైగా కేడెట్లు వేర్వేరు ప్రాంతాల్లో సేవలందించారని పేర్కొన్నారు. పౌర రక్షణ, హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌తోపాటు సామాజిక సేవలో పాల్గొన్నారని వెల్లడించారు. మన సైనిక దళాలకు సహకరించారని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారని, జవాన్లకు ప్రాథమిక చికిత్స అందించారని గుర్తుచేశారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా కేడెట్లు 8 లక్షల మొక్కలు నాటారని చెప్పారు. వాటిని సంరక్షించడం మన బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈయూతో డీల్ గేమ్ చేంజర్
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాలతో మనం కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో(ఎఫ్‌టీఏ) దేశంలో యువతకు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. తాజాగా ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంతో లక్షలాది మంది యువతకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. నేడు ప్రపంచం మొత్తం పూర్తి విశ్వాసంతో భారతీయ యువత వైపు దృష్టి సారించిందని అన్నారు. ఇందుకు మన యువతలోని నైపుణ్యాలు, సంస్కారమే కారణమని ఉద్ఘాటించారు. ‘ఇదే సమయం, ఇదే సరైన సమయం’ అంటూ ఎర్రకోట నుంచి చెప్పానని గుర్తుచేశారు.
ఆ విషయంలో ఎన్‌సీసీకి తిరుగులేదు
ఎన్‌సీసీ అంటే ఒక వ్యవస్థ మాత్రమే కాదని.. అదొక విప్లవమని ప్రధాని మోదీ అభివర్ణించారు. యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని ప్రశంసించారు. దేశం పట్ల అంకితభావం కలిగిన పౌరులను తయారు చేస్తోందన్నారు. యువతలో క్రమశిక్షణ పెంచడంతో ఎన్‌సీసీకి తిరుగులేదన్నారు. ప్రజాస్వామ్య సంస్కృతిని కలిగి ఉండడం భారతీయ యువత ప్రత్యేకత అని వెల్లడించారు. వైవిధ్యం పట్ల వారికి ఎనలేని గౌరవం ఉందన్నారు. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంగా భావిస్తుంటారని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్‌సీసీ కేడెట్ల సంఖ్య ఇటీవల 14 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగిందన్నారు. ప్రధానంగా దేశ సరిహద్దులు, కోస్తా తీరాల్లోని యువత ఎన్‌సీసీలో చేరుతున్నారని తెలిపారు. ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’లో కేడెట్ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.


