అందుకోసం పార్లమెంట్ సభ్యులు ఐక్యంగా పనిచేయాలి
దేశంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఆగదు
పేదల బాగు కోసమే వీబీ జీ రామ్ జీ చట్టం
పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పషీ్టకరణ
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం
న్యూఢిల్లీ: మనందరి సంకల్పమైన వికసిత్ భారత్’ పట్ల పార్లమెంట్ సభ్యులంతా ఐక్యంగా ఉండాలని, స్వదేశీ, జాతీయ భద్రత కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో పారీ్టలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన కోసం ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావించారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని వివరించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైనిక దళాల పరాక్రమాన్ని ప్రపంచం వీక్షించిందని అన్నారు. మన సొంత వనరులతోనే ఉగ్రవాదుల భరతం పట్టామని చెప్పారు. ఉగ్రవాద చర్యలపై నిర్ణయాత్మక ప్రతిచర్య తప్పదని ఉద్ఘాటించారు. మన శక్తి సామర్థ్యాలను బాధ్యతాయుతంగానే ఉపయోగిస్తామని పేర్కొన్నారు. వేర్వేరు అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ ఐక్యత కంటే అవి ఎక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి
‘‘మహాత్మాగాం«దీ, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్‌బిహారీ వాజ్‌పేయి వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో అవన్నీ సహజమే. కొన్ని అంశాలు మాత్రం ఇలాంటి భిన్నాభిప్రాయాలకు పూర్తిగా అతీతం. వికసిత్ భారత్ సంకల్పం, దేశ భద్రత, ఆత్మనిర్భరత, స్వదేశీ ఉద్యమం, దేశ ఐక్యత, స్వచ్ఛత లాంటివి దేశానికి సంబంధించినవి. దేశ ప్రయోజనాల విషయంలో రాజ్యాంగ స్ఫూర్తితో ఎంపీలు ఐకమత్యంతో పనిచేయాలి.
విద్యాసంస్థల్లో వివక్షకు తావులేదు
దేశంలో సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం కోసం యూజీసీ కృషి చేస్తోంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల పట్ల వివక్షకు తావులేదు. పేదల సాధికారతే ప్రభుత్వ ధ్యేయం. ఈ శతాబ్దం తొలి 25 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. గత 11 ఏళ్లలో ప్రతి రంగంలో పునాదులు మరింత పటిష్టమయ్యాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన ‘వీబీ–జీ రామ్ జీ’ చట్టంతో పేదలకు కచి్చతంగా మేలు జరుగుతుంది. ఏటా 125 రోజులపాటు ఉపాధికి హామీ లభిస్తుంది.
మనకు సొంతంగా అంతరిక్ష కేంద్రం
యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం హర్షణీయం. దీనివల్ల మన దేశంలో తయారీ, సేవల రంగాలకు లబ్ధి చేకూరుతుంది. యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత, అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పటికీ గత 11 ఏళ్లుగా మనదేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ బలం పుంజుకుంటోంది.సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొనే దిశగా మన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గగనయాన్ మిషన్ కోసం మన సైంటిస్టులు ఉత్సాహం పని చేస్తున్నారు.
స్వయం సమృద్ధ దేశంగా భారత్
వందేమాతర గీతం 150 వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. గీత రచయిత బంకించంద్ర ఛటర్జీని ప్రజలు స్మరించుకుంటున్నారు. వందేమాతరంపై పార్లమెంట్‌పై ప్రత్యేక చర్చ చేపట్టినందుకు ఎంపీలకు నా అభినందనలు. స్వయం సమృద్ధ జీవితం లేని స్వాతంత్య్రం అసంపూర్ణం అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. దేశాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం శ్రమిస్తోంది.
సంపూర్ణ ఆత్మగౌరవంతో ముందడుగు
బ్రిటిష్ వలస పాలన కాలంలో ‘మెకాలే కుట్రల’ ద్వారా భారతీయుల్లో ఆత్మన్యూనత భావం పెంచారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత కూడా అదే కొనసాగింది. కానీ, ఇప్పటి ప్రభుత్వ వలసవాద మనస్తత్వాన్ని వదిలిస్తోంది. సంపూర్ణ ఆత్మగౌరవంతో దేశం ముందుకెళ్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని భద్రత లభిస్తుండడం శుభసూచకం.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద గతేడాది 2.5 కోట్ల మంది ఉచితంగా వైద్య సేవలు పొందారు. గత దశాబ్ద కాలలో పేదల కోసం ప్రభుత్వం 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది. గతేడాది 32 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేర్వేరు దేశాల మధ్య భారత్ ఒక వారధిగా పనిచేస్తోంది. సంక్షోభాల నివారణలో తనవంతు పాత్ర పోషిస్తోంది’’ అని రాష్ట్రపతి ముర్ము వివరించారు.
‘జీ రామ్ జీ’పై విపక్షాల ఆందోళన
రాష్ట్రపతి తన ప్రసంగంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని ప్రస్తావించినప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిరీ్వర్యం చేసిందని మండిపడ్డారు. జీ రామ్ జీ చట్టంపై రాష్ట్రపతి ప్రసంగానికి మద్దతుగా అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.


