breaking news
Swadeshi
-
స్వదేశీ అమలుకు అడ్డంకేమిటి?
‘స్వదేశీ’ అనే గొప్ప నినాదాన్ని స్వాతంత్య్రోద్యమ కాలంలో అప్పటి నాయకులు ఒకసారి ఇచ్చారు. స్వాతంత్య్రాన్ని సాధించుకుని కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ప్రస్తుత నాయకత్వం మరొకసారి ఇస్తు న్నది. ఆ నినాదం పారిశ్రామిక వర్గాలను గానీ, సమాజాన్ని గానీ అపుడెట్లా ఉత్తేజ పరిచింది, ఇపుడెట్లా చేస్తున్నది? ఆ దరి మిలా నినాదపు అమలు అపుడెట్లా జరగింది, ఇపుడెట్లా జరుగుతున్నది?ఇందుకు సమాధానాన్ని మామూలు పద్ధతిలో వెతికి అపుడు గొప్పగా ఉండేదనీ, ఇపుడు ఆశించిన ఫలితాలు లేవనీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ అది విషయాలను సమగ్ర దృష్టితో పరిశీలించి చేసే విమర్శ కాబోదు. ఎందుకంటే, స్వాతంత్య్రోద్యమ కాలపు స్వదేశీ నినాద స్ఫూర్తి లోపించటం స్వాతంత్య్రం లభించిన తర్వాత కాంగ్రెస్ పాలనా కాలం నుంచే మొదలై, ప్రస్తుత బీజేపీ పాలన వరకు కూడా కొనసాగుతున్నది. ఎందుకన్నది ప్రశ్న. ఆ స్ఫూర్తి తిరిగి రావటం ఎట్లాగన్నది విషయం.బెంగాల్ విభజన కాలంలో...చర్చలోకి వెళ్లేముందు ఈ రెండు సందర్భాలలో ‘స్వదేశీ’ భావనల నేపథ్యం కొంత చూడాలి. ఆ మాట మొదటిసారిగా బ్రిటిష్ వలస పాలనా కాలంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్‌ను 1905లో రెండుగా విభజించినపుడు అందుకు నిరసనగా అక్కడి నాయకులు, సమాజం ముందుకు తెచ్చినటువంటిది. వారు బ్రిటన్‌కు సంబంధించిన అన్నింటిని బహిష్కరించి హింసాత్మక ఉద్యమం సాగించగా విభజన రద్దయింది. తర్వాత కొన్నేళ్లకు ఉద్యమ ప్రవేశం చేసిన గాంధీజీ ఆ నినాదానికి కొత్త అజెండాను రూపొందించారు. ప్రస్తుతం మనం అంటున్న స్వదేశీ నినాదానికి మూలాలు ఆయన అజెండాలో ఉన్నాయి. అందులో భాగంగా ఆయన ప్రజలకు బోధించింది ఆర్థిక స్వావలంబన, స్వయంసమృద్ధి, స్థానిక ఉత్పత్తుల వాడకం, అందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, వీటన్నింటికి సమాంతరంగా విదేశీ వస్తు బహిష్కరణ. ఆ కాలంలో టాటా, బిర్లా వంటి భారీ పారిశ్రామికసంస్థలు ఒక మేర బ్రిటిష్ కంపెనీల సహకారంతో నడిచినప్పటికీ, మరొకవైపు గాంధీజీ నినాదం ప్రజల స్థాయిలో ఒక ఉద్యమంగా సాగింది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిశ్రామి కాభివృద్ధి కోసం ప్రయత్నించటం అవసరమే అయినా, అందుకు సమాంతరంగా ఖాదీ గ్రామీణోద్యోగ రంగాన్ని కొంతకాలం మొక్కు బడిగా నడిపి దిక్కులేనిదిగా వదిలారు. పారిశ్రామిక రంగం క్రమంగా స్వదేశీ – విదేశీ మిశ్రమంగా మారింది. ప్రజలలో సైతం గత కాలపు స్ఫూర్తి అంతరించి విదేశీ ఉత్పత్తుల పట్ల మోజు పెరుగుతూ పోయింది. ఆ మాటే వినని తరం...1991లో భారతదేశం డబ్లు్యటీవోలో ప్రవేశించి, ఆర్థిక సంస్కర ణల ద్వారా విదేశీకి తలుపులు పూర్తిగా తెరిచింది. మతం విష యాన్ని అట్లుంచితే, జాతీయతా భావనలు బలంగా ఉండే ఆరెస్సెస్ ద్వారా అదే సంవత్సరం స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పడింది గాని పరిమితంగానే పనిచేయగలిగింది. తర్వాత కాలంలో వాజ్‌పేయి ప్రధానిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా స్వదేశీని పక్కకు పెట్టింది. అందుకు కారణం, భారత పారిశ్రామిక, వాణిజ్య వర్గా లలో అత్యధికులు విదేశీ పెట్టుబడులతో కలిసి ఉమ్మడి ఉత్పత్తులు, వ్యాపారాల వైపు మొగ్గటం. బయటినుంచి ప్రత్యక్ష పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, ఎగుమతులకు తగిన స్థాయిలో ఉత్పత్తులు చేసేందుకు టెక్నాలజీ దిగుమతులు, ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ అభివృద్ధి అవసరమనే దృష్టి పెరుగుతూ పోయాయి. ఈ కొత్త దశలో అత్యధికులు ‘స్వదేశీ’ అనే మాటనే విని ఉండరు. 1947కు ముందటి స్వదేశీ దృక్పథం, స్ఫూర్తీ, ఆ తర్వాత అర్ధ శతాబ్దం గడిచి, రెండు తరాలు మారి, రెండు ప్రధానమైన పార్టీల పరిపాలనను కూడా చూసిన వెనుక, ఉక్కిరిబిక్కిరై అవసాన దశలోకి ప్రవేశించింది.ఈ విధమైన రెండు దశల వెనుక 2014లో అధికారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, మరొక పేరుతో తిరిగి స్వదేశీ నినాదాన్ని ఇచ్చారు. అందుకు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి పేర్లు పెట్టారు. ఆయన గుజరాత్‌కు చెందినవారు కావటం, గుజరాత్ – మహారాష్ట్ర ప్రాంతంలో స్థానిక పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు బలంగా ఎదగటం ఒకటైతే, విదేశీ పెట్టుబడులు, కంపెనీలు రావాలి గానీ అవి తమకు అనుకూలమైన విధంగా వ్యవ హరించాలనుకునే ధోరణులు పెరగటం మరొకటిగా మారి, ఈ కొత్త తరహా స్వదేశీ నినాదానికి భూమికగా మారాయి. దీనితోపాటు ఆత్మనిర్భర్‌కు మూల స్తంభాలని అయిదింటిని పేర్కొన్నారు. అవి ఆర్థికం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థలను నిర్మించి బలోపేతం చేయటం, సమాజాన్ని క్రియాశీలం చేయటం, దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచటం. నాలుగు కీలకాంశాలుఅప్పటినుంచి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిన సమీక్షలు ప్రోత్సాహకరంగా లేకపోవటం గమనించదగ్గది. ఆత్మ నిర్భర్‌కు మూలస్తంభాలుగా పైన పేర్కొన్న అయిదు రంగాలలో పెరుగుదల లేదని కాదు. కానీ అది సాధారణమైన రీతిలో జరుగు తుండేదే తప్ప ప్రత్యేకమైన ఊపు ఏదీ రాలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం జపాన్ను మించి నాల్గవ స్థానానికి చేరటానికి ఒక కారణం మన దేశ పరిమాణం ఇంత పెద్దది కావటమైతే, మరొక కారణం జపాన్ అభివృద్ధి వేగం మందగించటం. దీని అర్థం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పెనవేసుకుపోయిన స్థితిలో ఒంటరితనంగా ఎదగాలని కాదు. అది అసాధ్యం, అవాంఛ నీయం కూడా. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పునర్నవీకరణ జరుగుతూనే, మౌలిక స్థాయిలో స్వదేశీ, స్వావలంబనలను పునాదులుగా నిలబెట్టుకోవచ్చు. ఇతరులపై ఆధారపడటం తగ్గుతూ, వారి ఒత్తిడులకు భయపడే స్థితిని పోగొట్టు కోవచ్చు. ఇది ప్రభుత్వపరంగా జరగవలసినది కాగా, సమాజాన్ని కూడా అదే స్ఫూర్తితో ఆ ప్రణాళికలో భాగస్వామిని చేయటం అసాధ్యం కాదు. అమెరికా ట్యారిఫ్‌లు వాణిజ్య ఒప్పంద ఒత్తిడుల స్థితిలో ఇపుడీ మాటను ప్రధాని మోదీ తనకు తాను పదేపదే గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలకు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ మూలంలో అసలు ప్రస్తావనకు రాని కీలకమైన విషయం ఒకటున్నది. భారతదేశానికి గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ప్రజలకు గొప్ప దేశభక్తి, జాతీయతా భావాలున్నాయి. ఏ దేశానికైనా, జాతికైనా ఈ నాలుగు అంశాలు కలిసి ఎనలేని శక్తిని ఇవ్వగలవు. వాటిని ఒక దార్శనికత, ప్రణాళిక, పట్టుదల, నిజాయితీ అనే నాలుగు అంశాలతో సమన్వయం చేసి ఆచరణలోకి తేగల నాయకత్వం ఉన్నట్లయితే ఆశించిన ఫలితాలను సాధించగలరు. అది జరిగినందువల్లనే స్వదేశీ నినాదం స్వాతంత్య్రోద్యమ కాలంలో విజయవంతమైంది. స్వాతంత్య్రానంతరం ఎవరు పాలించినా ఆ పని చేయలేక పోతున్నారు. స్వదేశీ నినాదాల అమలుకు మౌలికమైన అడ్డంకిగా నిలుస్తున్న లోపం అదే.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్‌లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
ఖాదీ.. అదే మా నినాదం
జాతిపిత మహాత్మాగాంధీ అంటే స్వతంత్ర పోరాటం.. ఆపై ఠక్కున గుర్తుకు వచ్చేది ఆయన చేసిన స్వదేశీ ఉద్యమమే. గాంధీ మహాత్ముడు స్వయంగా చరఖా చేతపట్టి నూలువడికి.. చేనేత దుస్తులను ధరించేవారు. దాదాపు శతాబ్దం తరువాత.. మళ్లీ దేశంలో అప్రకటి స్వదేశీ ఉద్యమం మొదలైంది. చేనేత, ఖాదీ, ఖద్దర్ దుస్తులకు దేశంలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా ఆధునిక యువత ఈ దుస్తులపై అధికంగా మోజు పెంచుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాషన్‌గా ఉండే ప్రతి వస్తువును.. హ్యాండ్మేడ్గా (చేతివృత్తులు) ఉండేలా యువత చూసుకుంటోంది. ఇదే చేనేత వృత్తులు అవలంబించేవారికి కొత్త ఉపాధిని అందిస్తోందని పలువురు ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. ఖాదీ దుస్తుల్లో చరఖా మీద నూలు వడికిన వాటికి ఉత్తర భారతీయ యువత అధిక ప్రధాన్యతను ఇస్తోందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్రం వచ్చాక.. ఖాదీ పరిశ్రమ ఏళ్ల తరబడి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. పేదవాళ్లు మాత్రమే ఖాదీ దుస్తులు ధరిస్తారనే అపోహ కూడ ఒక కారణం. అయితే ఆధునిక కాలంలో ఖాధీ అత్యంత లగ్జరీ, విలాసవంతమైన దుస్తులుగా గుర్తింపు పొందడంతో మళ్లీ డిమాండ్ పెరిగిందని.. ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మన ఖాదీ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని ముంబై డిజైనర్లు పేర్కొంటున్నారు. ఆధునిక యువతలో దేశభక్తి అధికంగా పెరగడం, అదే సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం సామాజికంగా బలపడ్డంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఫ్యాషన్ డిజైన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సునీల్ సేథీ చెప్పారు. అందులోనూ ఖాదీలో రంగులు, విభిన్న మోడల్స్ అందుబాటులోకి రావడంతో.. వీటిని ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అన్నారు. -
ఏమైంది స్వదేశీ?
ఇటీవల గుజరాత్లో జరిగిన వైబ్రంట్ పారిశ్రామికవేత్తల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు కొంత ఆందోళనకరంగాను, ఇంకొన్ని మోదం కూర్చేవిగాను ఉన్నాయి. పదిలక్షల కోట్ల రూపాయలను గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం హర్షణీయమే. ఆ పెట్టుబడులు ఆ రాష్ట్రం శరవేగంగా పురోగతి సాధించ డానికి దోహదపడే మాటవాస్తవం. అయితే ఈ పెట్టుబడులలో సింహ భాగం విదేశీ కంపెనీల నుంచి రావడం మంచి పరిణా మం కాదు. ప్రపంచీకరణ తరువాత దేశంలోకి చొరబడు తున్న బహుళ జాతిసంస్థల వలన దేశ ప్రగతి విషయం లో మన ప్రభుత్వం పట్టు సడలిపోతోంది. విదేశీ సం స్థలు దేశంలోని వనరులను ఉపయోగించుకుని, వాటిని ఇక్కడే విక్రయించి లాభాలను మాత్రం ఆయా కంపెనీల సొంత దేశాలకు తరలిస్తున్నాయి. దీని వలన మన దేశానికి వచ్చే లాభం ఏమిటి? ఇదంతా బీజేపీ అధికారంలో ఉండగా జరగడమే విచిత్రం. స్వదేశీ అంటూ గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపిన పార్టీ ఇప్పుడు ఇలాంటి ధోరణులకు పాల్పడడం దారుణం. దేశీయమైన పెట్టుబడులతోనే దేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఆ పార్టీ ఉల్లంఘించింది. ఇది సరికాదు. సీహెచ్. సాయి రుత్విక నల్లగొండ


