
‘స్వదేశీ’ అనే గొప్ప నినాదాన్ని స్వాతంత్య్రోద్యమ కాలంలో అప్పటి నాయకులు ఒకసారి ఇచ్చారు. స్వాతంత్య్రాన్ని సాధించుకుని కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ప్రస్తుత నాయకత్వం మరొకసారి ఇస్తు న్నది. ఆ నినాదం పారిశ్రామిక వర్గాలను గానీ, సమాజాన్ని గానీ అపుడెట్లా ఉత్తేజ పరిచింది, ఇపుడెట్లా చేస్తున్నది? ఆ దరి మిలా నినాదపు అమలు అపుడెట్లా జరగింది, ఇపుడెట్లా జరుగుతున్నది?ఇందుకు సమాధానాన్ని మామూలు పద్ధతిలో వెతికి అపుడు గొప్పగా ఉండేదనీ, ఇపుడు ఆశించిన ఫలితాలు లేవనీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు.
కానీ అది విషయాలను సమగ్ర దృష్టితో పరిశీలించి చేసే విమర్శ కాబోదు. ఎందుకంటే, స్వాతంత్య్రోద్యమ కాలపు స్వదేశీ నినాద స్ఫూర్తి లోపించటం స్వాతంత్య్రం లభించిన తర్వాత కాంగ్రెస్ పాలనా కాలం నుంచే మొదలై, ప్రస్తుత బీజేపీ పాలన వరకు కూడా కొనసాగుతున్నది. ఎందుకన్నది ప్రశ్న. ఆ స్ఫూర్తి తిరిగి రావటం ఎట్లాగన్నది విషయం.
బెంగాల్ విభజన కాలంలో...
చర్చలోకి వెళ్లేముందు ఈ రెండు సందర్భాలలో ‘స్వదేశీ’ భావనల నేపథ్యం కొంత చూడాలి. ఆ మాట మొదటిసారిగా బ్రిటిష్ వలస పాలనా కాలంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్‌ను 1905లో రెండుగా విభజించినపుడు అందుకు నిరసనగా అక్కడి నాయకులు, సమాజం ముందుకు తెచ్చినటువంటిది. వారు బ్రిటన్‌కు సంబంధించిన అన్నింటిని బహిష్కరించి హింసాత్మక ఉద్యమం సాగించగా విభజన రద్దయింది. తర్వాత కొన్నేళ్లకు ఉద్యమ ప్రవేశం చేసిన గాంధీజీ ఆ నినాదానికి కొత్త అజెండాను రూపొందించారు.
ప్రస్తుతం మనం అంటున్న స్వదేశీ నినాదానికి మూలాలు ఆయన అజెండాలో ఉన్నాయి. అందులో భాగంగా ఆయన ప్రజలకు బోధించింది ఆర్థిక స్వావలంబన, స్వయంసమృద్ధి, స్థానిక ఉత్పత్తుల వాడకం, అందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, వీటన్నింటికి సమాంతరంగా విదేశీ వస్తు బహిష్కరణ. ఆ కాలంలో టాటా, బిర్లా వంటి భారీ పారిశ్రామికసంస్థలు ఒక మేర బ్రిటిష్ కంపెనీల సహకారంతో నడిచినప్పటికీ, మరొకవైపు గాంధీజీ నినాదం ప్రజల స్థాయిలో ఒక ఉద్యమంగా సాగింది.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిశ్రామి కాభివృద్ధి కోసం ప్రయత్నించటం అవసరమే అయినా, అందుకు సమాంతరంగా ఖాదీ గ్రామీణోద్యోగ రంగాన్ని కొంతకాలం మొక్కు బడిగా నడిపి దిక్కులేనిదిగా వదిలారు. పారిశ్రామిక రంగం క్రమంగా స్వదేశీ – విదేశీ మిశ్రమంగా మారింది. ప్రజలలో సైతం గత కాలపు స్ఫూర్తి అంతరించి విదేశీ ఉత్పత్తుల పట్ల మోజు పెరుగుతూ పోయింది.
ఆ మాటే వినని తరం...
1991లో భారతదేశం డబ్లు్యటీవోలో ప్రవేశించి, ఆర్థిక సంస్కర ణల ద్వారా విదేశీకి తలుపులు పూర్తిగా తెరిచింది. మతం విష యాన్ని అట్లుంచితే, జాతీయతా భావనలు బలంగా ఉండే ఆరెస్సెస్ ద్వారా అదే సంవత్సరం స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పడింది గాని పరిమితంగానే పనిచేయగలిగింది. తర్వాత కాలంలో వాజ్‌పేయి ప్రధానిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా స్వదేశీని పక్కకు పెట్టింది. అందుకు కారణం, భారత పారిశ్రామిక, వాణిజ్య వర్గా లలో అత్యధికులు విదేశీ పెట్టుబడులతో కలిసి ఉమ్మడి ఉత్పత్తులు, వ్యాపారాల వైపు మొగ్గటం.
బయటినుంచి ప్రత్యక్ష పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, ఎగుమతులకు తగిన స్థాయిలో ఉత్పత్తులు చేసేందుకు టెక్నాలజీ దిగుమతులు, ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ అభివృద్ధి అవసరమనే దృష్టి పెరుగుతూ పోయాయి. ఈ కొత్త దశలో అత్యధికులు ‘స్వదేశీ’ అనే మాటనే విని ఉండరు. 1947కు ముందటి స్వదేశీ దృక్పథం, స్ఫూర్తీ, ఆ తర్వాత అర్ధ శతాబ్దం గడిచి, రెండు తరాలు మారి, రెండు ప్రధానమైన పార్టీల పరిపాలనను కూడా చూసిన వెనుక, ఉక్కిరిబిక్కిరై అవసాన దశలోకి ప్రవేశించింది.
ఈ విధమైన రెండు దశల వెనుక 2014లో అధికారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, మరొక పేరుతో తిరిగి స్వదేశీ నినాదాన్ని ఇచ్చారు. అందుకు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి పేర్లు పెట్టారు. ఆయన గుజరాత్‌కు చెందినవారు కావటం, గుజరాత్ – మహారాష్ట్ర ప్రాంతంలో స్థానిక పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు బలంగా ఎదగటం ఒకటైతే, విదేశీ పెట్టుబడులు, కంపెనీలు రావాలి గానీ అవి తమకు అనుకూలమైన విధంగా వ్యవ హరించాలనుకునే ధోరణులు పెరగటం మరొకటిగా మారి, ఈ కొత్త తరహా స్వదేశీ నినాదానికి భూమికగా మారాయి.
దీనితోపాటు ఆత్మనిర్భర్‌కు మూల స్తంభాలని అయిదింటిని పేర్కొన్నారు. అవి ఆర్థికం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థలను నిర్మించి బలోపేతం చేయటం, సమాజాన్ని క్రియాశీలం చేయటం, దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచటం.
నాలుగు కీలకాంశాలు
అప్పటినుంచి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిన సమీక్షలు ప్రోత్సాహకరంగా లేకపోవటం గమనించదగ్గది. ఆత్మ నిర్భర్‌కు మూలస్తంభాలుగా పైన పేర్కొన్న అయిదు రంగాలలో పెరుగుదల లేదని కాదు. కానీ అది సాధారణమైన రీతిలో జరుగు తుండేదే తప్ప ప్రత్యేకమైన ఊపు ఏదీ రాలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం జపాన్‌ను మించి నాల్గవ స్థానానికి చేరటానికి ఒక కారణం మన దేశ పరిమాణం ఇంత పెద్దది కావటమైతే, మరొక కారణం జపాన్ అభివృద్ధి వేగం మందగించటం.
దీని అర్థం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పెనవేసుకుపోయిన స్థితిలో ఒంటరితనంగా ఎదగాలని కాదు. అది అసాధ్యం, అవాంఛ నీయం కూడా. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పునర్నవీకరణ జరుగుతూనే, మౌలిక స్థాయిలో స్వదేశీ, స్వావలంబనలను పునాదులుగా నిలబెట్టుకోవచ్చు. ఇతరులపై ఆధారపడటం తగ్గుతూ, వారి ఒత్తిడులకు భయపడే స్థితిని పోగొట్టు కోవచ్చు. ఇది ప్రభుత్వపరంగా జరగవలసినది కాగా, సమాజాన్ని కూడా అదే స్ఫూర్తితో ఆ ప్రణాళికలో భాగస్వామిని చేయటం అసాధ్యం కాదు.
అమెరికా ట్యారిఫ్‌లు వాణిజ్య ఒప్పంద ఒత్తిడుల స్థితిలో ఇపుడీ మాటను ప్రధాని మోదీ తనకు తాను పదేపదే గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలకు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ మూలంలో అసలు ప్రస్తావనకు రాని కీలకమైన విషయం ఒకటున్నది. భారతదేశానికి గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ప్రజలకు గొప్ప దేశభక్తి, జాతీయతా భావాలున్నాయి. ఏ దేశానికైనా, జాతికైనా ఈ నాలుగు అంశాలు కలిసి ఎనలేని శక్తిని ఇవ్వగలవు.
వాటిని ఒక దార్శనికత, ప్రణాళిక, పట్టుదల, నిజాయితీ అనే నాలుగు అంశాలతో సమన్వయం చేసి ఆచరణలోకి తేగల నాయకత్వం ఉన్నట్లయితే ఆశించిన ఫలితాలను సాధించగలరు. అది జరిగినందువల్లనే స్వదేశీ నినాదం స్వాతంత్య్రోద్యమ కాలంలో విజయవంతమైంది. స్వాతంత్య్రానంతరం ఎవరు పాలించినా ఆ పని చేయలేక పోతున్నారు. స్వదేశీ నినాదాల అమలుకు మౌలికమైన అడ్డంకిగా నిలుస్తున్న లోపం అదే.
- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
-టంకశాల అశోక్