
మాధవ్ శింగరాజు
ఆటలో– ‘పడని’వాళ్లు ఉండరు. తలపడవలసిన వాళ్లు మాత్రమే ఉంటారు. రాజకీయాలైనా అంతే. గెలుపు కోసం ఆటలోకి దిగినవాడు యోధుడైతే, ఓడించటానికే ఆడేవాడు మహాయోధుడు! శ్రీ మోదీజీ నాకెప్పుడూ యోధుడిలా అనిపించరు. అన్నీ బయటికే అనలేం. కొన్ని అనకుండానూ ఉండలేం. నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కనుక, మా వైపూ యోధానుయోధులు ఉండే ఉంటారు కనుక, మోదీజీని నేను ‘మహాయోధుడు’ అనకూడదు. అనకూడదు కానీ, అనకుండా ఉండలేక పోతున్నాను కనుక, మోదీజీ యోధుడు కాదు అని మాత్రమే అనవలసి వస్తోంది.
జట్టులో కెప్టెన్ అంటూ ఒకరు లేరంటే, జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్‌కు సమానమైన వాళ్లేనని! ఇది బీజేపీ స్టయిల్. జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్‌కు సమానమైన వాళ్లే అయినప్పటికీ, కెప్టెన్ ఎవరో తేల్చుకోలేక పోతున్నారంటే జట్టులో ఎవరి ఆట వారిదేనని! ఇది కాంగ్రెస్ ట్రెడిషన్!
ఎప్పటిలా ఆటకు ముందే, తన ఆట మొదలు పెట్టేశారు మోదీజీ! నవంబరులో బిహార్ ఎన్నికలు. మార్చిలో బెంగాల్ ఎన్నికలు. ఏప్రిల్‌లో తమిళనాడు ఎన్నికలు.
బిహార్ క్యాంపెయిన్‌కు ధర్మేంద్ర ప్రధాన్‌ని, సి.ఆర్. పాటిల్‌ని, కేశవ్ ప్రసాద్ మౌర్యని; పశ్చిమ బెంగాల్ క్యాంపెయిన్‌కు భూపేందర్ యాదవ్‌ని, విప్లవ్ కుమార్ దేవ్‌ని; తమిళనాడు క్యాంపెయిన్‌కు వైజయంత్ పాండాను, మురళీధర్ మొహల్‌ను పంపిస్తున్నారు మోదీజీ!
‘పర్ఫెక్ట్ కాంబినేషన్‘, ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‘ అని ప్రత్యర్థి జట్టు చేత కూడా అనిపించుకోగలరు ఆయన.
బిహార్ వెళ్లే ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్. సి.ఆర్. పాటిల్ యూనియన్ మినిస్టర్–కమ్–గుజరాత్ బీజేపీ చీఫ్. కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.
పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే భూపేందర్ యాదవ్ యూనియన్ మినిస్టర్. విప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి.
తమిళనాడుకు వెళ్లే వైజయంత్ పాండా పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మురళీధర్ మొహల్ యూనియన్ మినిస్టర్.
ప్రధాన్, యాదవ్... ఓబీసీ ఓట్ల స్ట్రాటజిస్టులు. హర్యానాలో బీజేపీ ప్రధాన్ వల్ల గెలిచింది. మహారాష్ట్రలో యాదవ్ వల్ల
గెలిచింది. ఇక మౌర్య, దేవ్, పాండా, మొహల్ సముద్రపు గాలుల్నే మలుపు తిప్పగలిగిన నావికులు!
కాంగ్రెస్ ఇంకా గంగా నది ఒడ్డునే ఉంది! పట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లో బిహార్ ఎన్నికల గురించి ఒక వ్యూహం లేదు.
బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఊసే లేదు.
‘‘85 ఏళ్ల క్రితం ఇక్కడే ఈ సదాఖత్ ఆశ్రమంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది’’ అనుకున్నారు. ‘‘మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడే సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది...’’ అన్నారు.
‘‘85 ఏళ్ల క్రితం అప్పటి ఆ సీడబ్ల్యూసీ మీటింగ్‌కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు ఈ మీటింగ్‌కు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు’’ అన్నారు.
‘‘85 ఏళ్లకు ముందు ఈ ఆశ్రమంలో గాంధీ, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు సమావేశం అయ్యేవారు...’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు రాహుల్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటివారు హాజరయ్యారు’’ అన్నారు.
అన్నీ అనుకున్నాక, అన్నీ అన్నాక – ‘‘అది స్వాతంత్య్ర పోరాటం అయితే, ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’’ అని తీర్మానించి ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు!
రెండో స్వాతంత్య్ర పోరాటం, మూడో స్వాతంత్య్ర పోరాటం... అవసరం అయితే ఎన్ని స్వాతంత్య్ర పోరాటాలైనా చేయవలసిందే!
కానీ కాంగ్రెస్... గెలిచే పోరాటం చేయటం లేదు, ఓడించే పోరాటమూ చేయటం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కబడ్డీ జట్టుతో ఆటకు బిలియర్డ్స్ ప్లేయర్స్‌ని దింపుతూ ఉంటుంది!!