అక్కరకు రాని చట్టాలతో భయమేల? | To go on strike 60 days prior notice must be given instead of 14 days | Sakshi
Sakshi News home page

అక్కరకు రాని చట్టాలతో భయమేల?

Dec 29 2025 2:34 AM | Updated on Dec 29 2025 2:34 AM

To go on strike 60 days prior notice must be given instead of 14 days

గత నెల కొత్త కార్మిక చట్టాలు (లేబర్‌ కోడ్స్‌) అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధ నల్లో ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, ఎవరూ వాటి జోలికి పోవడం లేదు. కార్మిక వర్గాన్ని అవి ఎలా కట్టడి చేస్తు న్నాయి అనే అంశం మీదనే చర్చ జరుగు తోంది. నిజానికి ఈ కొత్త చట్టాల్లో కార్మికులకు లెక్కలేనన్ని తీపి గుళికలు ఉన్నాయి. అయినా సరే, సమ్మె అంశం ఒక్కటే ఒక ఎర్ర మిరపకాయలా కొట్టొచ్చి నట్లు కనిపిస్తోంది. దీంతో, సమ్మెలను అరికట్టే నిబంధనలే ప్రము ఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ భయాలకు హేతువు లేదు. 

వాస్తవం ఏమిటంటే, దేశంలో సమ్మెల సంఖ్య క్రమంగా తగ్గి పోతోంది. అయినా, మొట్టమొదటి ఫ్యాక్టరీ సైరన్‌ మోగిన నాటి నుంచీ కార్మిక అశాంతి భయమే కార్మిక చట్టాల్లో ప్రధానంగా ఉంటూవస్తోంది. పారిశ్రామిక రంగ చరిత్ర చూసినట్లయితే, చట్టాలు అత్యంత కఠినంగా ఉన్న కాలంలోనే సమ్మెలు అత్యధికంగా జరిగాయి. ఇది ఆశ్చర్యకర వాస్తవం. ‘రాబర్‌ బ్యారన్స్’గా పేరుమోసిన 19వ శతా బ్దపు అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వడ్డీ వ్యాపారులు తమ కిరాయి గూండాలతో కార్మికులను చితకబాదించేవారు. ఆ రోజులు పోయాయి.

అనుమానపు చూపులు
కాలగమనంలో కార్మిక వర్గం మార్పు చెందింది. అయినా ఫ్యాక్టరీ చట్టాలు మారలేదు. పాత మనస్తత్వం నుంచి బయట పడ లేదు. 2003–14 మధ్యకాలంలో దేశంలో సమ్మెలు 75 శాతం తగ్గాయి. 2019కి వస్తే కేవలం 59 సమ్మెలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 30కి పడిపోయింది. కార్మిక చట్టాలు నిరస నలను, సమ్మెలను మరింత కష్టతరంగా మార్చేస్తున్నాయి.

చివరకు ఎలా తయారయ్యిందంటే... ప్రభుత్వాలు, పారిశ్రా మికవేత్తలు, యాజమాన్యాలు చేపట్టే ప్రతి చర్యనూ కార్మికసంఘాలు అనుమానిస్తున్నాయి. కార్మిక చట్టాలు ప్రతిపాదించే సానుకూల చర్యలను గుర్తించడం లేదు. భవిష్యత్తులో సమ్మె జరిగే జాడే కనిపించడం లేదు. అయినా, ఒకవేళ సమ్మె చేయాలనుకుంటే అది మరింత కష్టతరం అవుతుందని యూనియన్లు బెంబేలెత్తి పోతున్నాయి.

కొత్త చట్టాలు కార్మికులకు ఒనగూర్చే ప్రయోజనాలు చూడండి: ఇక మీదట 240 రోజులకు బదులు 180 రోజులు పనిచేస్తే చాలు వార్షిక సెలవులు అందుబాటులోకి వస్తాయి. ఆర్జిత ప్రసూతి సెల వులు 12 వారాల నుంచి 16 వారాలకు పెరిగాయి. ‘గిగ్‌ వర్కర్లు’ రిటైర్మెంట్‌ ప్రయోజనాలకు అర్హులు. పురుషులు, మహిళలు సమాన పనికి సమాన వేతనం పొందుతారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులకు పునఃశిక్షణ కోసం 15 రోజుల వేతనం లభిస్తుంది.

అయితే కార్మిక ప్రతినిధులు వీటిని కంటితుడుపు చర్యలుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే, కొత్త చట్టాల ప్రకారం 300 కంటే తక్కువ మంది పనిచేస్తున్న సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే కార్మికులను తొలగించవచ్చు. ఇప్పటి వరకు ఈ పరి మితి 100గా ఉండేది. అలాగే, సమ్మె చేయాలంటే 14 రోజులకు బదులు 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఈ రెంటితో కార్మిక వర్గపు కోరలు పీకేసినట్లు అవుతుందని యూనియన్లు భావిస్తు న్నాయి. కరవలేని అరుపులకు ఇక విలువేముంటుంది?

ఉద్యోగుల సంఖ్య 299కి మించనట్లయితే, ఆ ఫ్యాక్టరీలు ప్రభు త్వానికి తెలియజేయకుండా ఉద్యోగులను తొలగించవచ్చు. ఇదే మంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే 100 నుంచి 199 మంది కార్మికులను నియమించుకునే సంస్థలు కేవలం 4.5 శాతం మాత్రమే ఉన్నాయి. యజమానులు సమ్మెల భయంతో ఉంటే, కార్మికులు లాక్‌ అవుట్ల భయంతో ఉన్నారు. కానీ సమ్మెలతో పాటు లాక్‌ అవుట్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. 2022లో కేవలం 34 లాక్‌ అవుట్లు మాత్రమే జరిగాయి. మరి భయం ఎందుకు?

ప్రయోజనాలు ఎంతమందికి?
గుర్తించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, కొత్త కోడ్స్‌లోని సానుకూలతలు దేశంలోని అధిక శాతం కార్మికులకు వర్తించవు. 20 కంటే తక్కువ మంది కార్మికులతో నడిచే ఫ్యాక్టరీలే దాదాపు 50 శాతం ఉన్నాయి. వీటికి ఆరోగ్య భద్రత నిబంధనలు సైతం వర్తించవు. కార్మికులు నిర్లక్ష్యానికి గురవుతారు. కార్మికుల సంఖ్య 300 దాటేంత స్థాయికి ఈ సంస్థలు చేరుకుంటాయని ఊహించడంకష్టం. 

సంఘటిత రంగంలో ఉద్యోగాల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోందని (2017–20) ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడీ వాటా కేవలం 17 శాతమే. ఆఖరుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ల్లోనూ ఇలాంటి ఉద్యోగాలు తగ్గాయి. ఈ సంస్థల్లో 2016–17లో 11.29 లక్షల మంది సంఘటిత కార్మికులు పని చేస్తూ ఉండగా, 2020–21లో వీరి సంఖ్య 8.61 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోనే ఇలా ఉంటే, ప్రైవేట్‌ రంగం పరిస్థితి  చెప్పేదేముంటుంది?

2023–24 ఆర్థిక సర్వే ప్రకారం, భారత కార్మికుల్లో 57 శాతం మంది స్వయం ఉపాధి మీదే ఆధారపడుతున్నారు. నిర్వచనం ప్రకారం వారు ఏ కార్మిక చట్టాల పరిధిలోకీ రారు. సంఘటితరంగంలో ఉపాధి తగ్గిపోతోంది కాబట్టే, సమ్మెలు తగ్గుతున్నాయి. మరోవంక, అసంఘటిత కార్మికులు పెరుగుతుండగా, లాక్‌ అవుట్ల సంఖ్యా క్షీణిస్తోంది. 2017లో 80.8 శాతం ఉన్న అసంఘటిత కార్మి కులు 2022లో 82.6 శాతానికి పెరిగారు.

ప్రభావం ఎంత?
కొత్త లేబర్‌ కోడ్స్‌ వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందా? మార్పు నామమాత్రమే! ఫ్యాక్టరీల్లో ప్రత్యక్ష ఉపాధి 2011లో 61 శాతంఉండగా, 2023లో 47 శాతానికి పడిపోయింది. సంఘటిత రంగం తన ఉద్యోగాలను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా అసంఘటిత రంగానికి తరలిస్తోంది. పెద్ద కార్ల కంపెనీలు సైతం ఛోటామోటా వర్క్‌షాప్స్‌ నుంచి విడి భాగాలు సమకూర్చుకుంటున్నాయి. ఆ కార్లపై ఉండే లోగో కేవలం లిప్‌స్టిక్‌ లాంటిది!

భారత పారిశ్రామిక రంగంలో అసంఘటిత కార్మికులు అత్య   ధికంగా ఉన్నంత కాలం కొత్త కార్మిక చట్టాలు ఎన్ని వచ్చినా పెద్దగా ఉపయోగపడవు. వ్యాపార ప్రముఖులు, కార్మిక సంఘాలు ఈ వాస్తవం గుర్తించాలి. ఒప్పందాలు కుదుర్చుకుని పనిచేసే కొద్దిమంది ఉన్నత వర్గ కార్మికులకే ఇవి ప్రయోజనం చేకూర్చగలవు. కాని వారు ఎంత మంది? అతి చిన్న వర్గం. అది పెరిగే అవకాశమూ లేదు. కార్మికులు భయపడే లాక్‌ అవుట్లు, పెట్టుబడిదారులు భీతిల్లే సమ్మెలు అరుదైనవిగా మారుతున్న ఈ రోజుల్లో కొత్త కార్మిక చట్టాలపై ఇంత గడబిడ అవసరమా?

-వ్యాసకర్త సోషియాలజిస్ట్‌(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
-దీపాంకర్‌ గుప్తా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement