2025లో 24,600 మందిని పంపిన ప్రపంచ దేశాలు
ఒక్క సౌదీ అరేబియా నుంచే 11,000 మంది, అమెరికా నుంచి 3,800 మంది రిటర్న్
వీసా ముగిసినా అక్కడే ఉండడం, సరైన అనుమతులు లేకపోవడమే ప్రధాన కారణాలు
తాజాగా రాజ్యసభకు తెలియజేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
సాక్షి, అమరావతి: సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లిన అనేక మంది భారతీయులను పలు దేశాలు తిరిగి వెనక్కి పంపుతున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 24,600 మంది భారతీయులు ఇలా వెనక్కి వచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన దేశాల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఒక్క సౌదీ అరేబియానే 11,000 మంది భారతీయులను సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు తీరినా ఆ దేశంలో ఉండడం, కార్మిక చట్టాలు ఉల్లంఘించడం వంటి కారణాలతో వెనక్కి పంపేసింది.
ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను బయటకు పంపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది అమెరికా నుంచి 3,800 మంది ఇలా వెనక్కి వచ్చేయగా అందులో ఒక్క వాషింగ్టన్ నుంచే 3,414 మంది, హోస్టన్ నుంచి 234 మంది ఉన్నట్లు కేంద్ర విదేశాంగమంత్రి తాజాగా రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే అత్యధికం..
విదేశాలకు భవన నిర్మాణ పనులు చేయడానికి వెళ్తున్నవారిలో అత్యధికమంది ఏజెంట్ల చేతిలో మోసపోయినవారే. మయన్మార్ నుంచి 1,591, మలేíÙయా నుంచి 1,485, యూఏఈ నుంచి 1,469, బహ్రెయిన్ నుంచి 769 మంది వెనక్కి వచ్చారు.
సరైన పత్రాలు లేకుండా ఆయా దేశాల్లోకి అడుగు పెట్టారంటూ వెనక్కి పంపించేశాయి. కేవలం ఉపాధి కోసం వెళ్లిన వారే కాకుండా విద్యార్థులు కూడా మోసపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారిలో అత్యధికంగా 170 మందిని బ్రిటన్ వెనక్కి పంపింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా 114 మందిని, రష్యా 82, అమెరికా 45 మంది విద్యార్థులను వెనక్కి పంపాయి.


