సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో కరచాలనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మంత్రులు, ప్రభుత్వ విప్‌లు అటాక్ మోడ్‌లోకి రావాలి
అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకపడొద్దు
నదీ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజలకు వాస్తవాలు వివరించాలి
పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చెప్పాలి
సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
సభకు రమ్మని మనమే కేసీఆర్‌ను అడిగాం..ఆయన వస్తే కథలు చెప్తారు
ఆ కథలే వాస్తవాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు.. అలా జరగడానికి వీల్లేదు
అందరూ నోట్స్ తయారు చేసుకుని చర్చల్లో పాల్గొనాలి.. బీఆర్‌ఎస్ అబద్ధాలను తిప్పికొట్టాలి
ప్రతి ప్రశ్నకూ సమాధానమివ్వాలన్న సీఎం.. ఎవరూ గైర్హాజరు కావొద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల హయాంలో ఏం జరిగిందనే వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ విప్‌లకు సూచించారు. వాస్తవాలు తమకే అనుకూలంగా ఉన్నందున, ప్రజలకు ఆ వాస్తవాలను వివరించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకపడొద్దని చెప్పారు. ఈసారి జరిగే సమావేశాల్లో అధికార పక్షంగా అటాక్ (దాడి) మోడ్‌లోకి రావాలంటూ దిశానిర్దేశం చేశారు. సోమవారం తొలిరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో ఆయన దాదాపు 35 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలకు దీటుగా ఇవ్వాల్సిన సమాధానాలపై మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..‘పాలమూరు–రంగారెడ్డి, కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో మనమే కేసీఆర్‌ను సవాల్ చేశాం. అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామంటూ ఆహ్వానించాం. ఇప్పుడు ఆయన వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ వస్తే కథలు చెప్తారు. ఆ కథలే వాస్తవాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. ప్రజలకు ఆ భావన కలగకూడదు. బీఆర్‌ఎస్ అబద్ధాలను మనం సమర్థంగా తిప్పికొట్టాలి. ఇందుకు అందరూ సిద్ధం కావాలి..’ అని సీఎం చెప్పారు.
అబద్ధాలు, అన్యాయం వారి విధానం
బీఆర్‌ఎస్ చేసే రాజకీయం అందరికీ తెలుసునని, అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించడమే కాకుండా అన్యాయంగా వ్యవహరించడం వారి విధానమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు వాళ్లకు అవకాశం కావాలని అడుగుతోంది. బీఆర్‌ఎస్ చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ డిమాండ్ మొదలుపెట్టారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమేకాకుండా, అసెంబ్లీలోనూ తీవ్రస్థాయిలో ఎండగట్టాలి. సుప్రీంకోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్లలో 7.1 టీఎంసీలు మాత్రమే చాలని ఏ విధంగా పేర్కొన్నారో నిలదీయాలి. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టులు గత కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై దాదాపు పూర్తి కావొచ్చినా.. వాటిని కూడా మొత్తం పూర్తి చేయకుండా పాలమూరు జిల్లాపై బీఆర్‌ఎస్ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించిన అంశాన్ని ఎండగట్టాలి.
పూర్తి అథారిటీ, లెక్కలతో జవాబులివ్వాలి
పూర్తి అథారిటీ (సాధికారికంగా), లెక్కలతో సహా బీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. బీఆర్‌ఎస్‌తో సహా ఏ పార్టీ సభ్యుడు అడిగిన ఎలాంటి సందేహానికైనా జవాబిచ్చేలా ఉండాలి. సబ్జెక్టుల వారీగా సిద్ధం కావాలి. ప్రతి అంశంపై నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలి. సమగ్రంగా చర్చలో పాల్గొనాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలి. 2వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరూ గైర్హాజరు కాకూడదు. ఈ మేరకు మంత్రులు, విప్‌లు సమన్వయం చేయాలి. కృష్ణా జలాలపై చర్చ జరగనున్నందున నది పరీవాహక ప్రాంతం పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్యేలు ధీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధం కావాలి..’ అని సీఎం సూచించినట్టు సమాచారం.


