మీసాలు పెంచడం సులభం.. పాలన చేయడమే కష్టం: కేటీఆర్
‘పాలమూరు’పై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం..
కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి నీళ్లపై చర్చకు ప్రిపేర్ అవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరు. మీసాలు పెంచడం చాలా సులభం.. కానీ పాలన చేయడమే కష్టం. గడ్డం, మీసం లేదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నన్ను ఉద్దేశించి కాదు. బహుశా వాళ్ల పార్టీ నేతలు రాహుల్ గాందీ, రాజీవ్ గాంధీని ఉద్దేశించి చేశాడనుకుంటా. నేను ఆంధ్రాలో చదవడాన్ని తప్పు పడుతున్న ముఖ్యమంత్రి అల్లుడిని మాత్రం అక్కడ నుంచే తెచ్చుకున్నారు..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ అభివాదం చేయడంపై స్పందించారు. ‘తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది. సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్ధులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే..’అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు కోపం వస్తుందనే ‘పాలమూరు’ను పడుకోబెట్టారు
‘ఏ ప్రభుత్వం అయినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు ప్రారంభించి అనుమతులు తెచ్చుకోవడం పరిపాటి. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా బయట పెట్టరు. పాలమూరు ప్రాజెక్టులో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే తప్ప రాజకీయంగా మాకు ఎలాంటి నష్టం జరగదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే ఉద్దేశంతోనే పనులు చేయకుండా పడుకోబెట్టారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితే అల్లాడుతున్న వారు ఆయన అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. నదులు, బేసిన్ల గురించి అవగాహన లేని సీఎం, మంత్రులు నీటిపారుదల శాఖపై జరిగే చర్చకు కేసీఆర్ రావాలని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి చర్చకు ప్రిపేర్ అవుతున్నారు. మేడిగడ్డ బరాజ్ పేల్చివేతలపై ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదు?’అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదని చెప్పగలరా?
‘శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెహ్రూ కాలం నుంచే గూఢచారి వ్యవస్థ ఉంది. ప్రస్తుతం నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా?. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ప్రస్తుత డీజీపీకి కూడా నిఘా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. సీఎంకు నిఘా వ్యవస్థ సమాచారం మాత్రమే ఇస్తుంది, సమాచారణ సేకరణ ఎలా చేసిందో చెప్పదు. ‘సిట్’లు, విచారణలతో ఇప్పటివరకు ఒక్క ఆరోపణ అయినా నిజమని తేల్చిందా? ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నాలను అర్ధం చేసుకున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులకు ఓటు వేసి కాంగ్రెస్‌కు పాలన చేతకాదని తేల్చి చెప్పారు..’అని కేటీఆర్ అన్నారు.
పార్టీ నుంచి వెళ్లిన వారికి డోర్లు క్లోజ్
‘పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదు. పార్టీ నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సైదిరెడ్డి వారి నియోజకవర్గాల్లో కనీసం ఒకటి రెండు సర్పంచ్ స్థానాలు కూడా గెలిపించుకోలేక పోయారు. పాలకుర్తి, బోథ్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో సత్తా చాటారు. అందువల్లే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు పెట్టేందుకు భయ పడుతోంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


