విశ్లేషణ
ఈ ఏడాది ఎక్కువసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేననడంలో సందేహం లేదు. ఐదు భిన్నమైన కారణాల రీత్యా ఆయన వార్తల్లో అగ్రభాగాన నిలిచారు. ఒకటి– అమెరికా ఫస్ట్ విధానం. రెండు– ఆయన సుంకాల యుద్ధం. మూడు– దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయాసియా నుంచి యూరప్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ద్వైపాక్షిక ఘర్షణల్లో తల దూర్చా లని కోరుకోవడం. నాలుగు– అమెరికా, చైనా, రష్యాల మధ్య సమీక రణలను మార్చడం. చివరగా, వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించి వార్తల కెక్కడమే కాకుండా, దర్యాప్తునకు లోనవడం!
భద్రతా వ్యూహంతో మరోసారి...
తాజాగా ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది అమెరికా భద్రతా వ్యూహంలో పశ్చిమ అర్ధ గోళానికున్న ప్రాధాన్యాన్ని చాటడమే కాకుండా, ఆ ప్రయోజనాలను కాపాడు కునేందుకు సైనిక చర్యను ప్రతిపాదించింది.
దౌత్య, సైనికపరంగా అమెరికా వాస్తవిక ప్రవర్తనను ప్రభా వితం చేయడంలో ఈ వ్యూహం ఎంత ముఖ్యమైనదిగా పరిణ మిస్తుందనేది వేచి చూడవలసి ఉంది. మన దేశంలో చాలావరకు, మనతో సంబంధాలు నెరపడంలో వ్యూహ పత్రం దృక్కోణం ఏమిటి? ట్రంప్ ప్రపంచ వీక్షణం, ‘పెద్ద వ్యూహం’లో భారత్ స్థానం ఎక్కడ? అమెరికా–భారత్ సంబంధాలు మున్నెన్నడూ ఎరుగనంతగా క్షీణించిపోయాయనే అందరూ అంటున్నమాట. ముఖ్యంగా, నాయకత్వ స్థాయి సాంగత్య స్వరూప స్వభావాలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి అపనమ్మకం తిరిగి చోటు చేసుకుంది.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమె గురించి నీచంగా మాట్లా డారు. భారత్ కూడా దానికి తగ్గట్లుగానే తలుపులు బిడాయించుకుని కూర్చుంది. భారత్, దాని నాయకత్వం గురించి వాషింగ్టన్ చర్చలలో ఎంత హీనంగా ప్రస్తావనకు వచ్చిందీ, ఆ తర్వాత బహిరంగపరచిన రహస్య పత్రాలు, కొందరు రాసుకున్న జ్ఞాపకాల పుస్తకాల ద్వారా వెల్లడైంది. ఇపుడు టెలివిజన్, సోషల్ మీడియాలో క్షణాల్లో అవి వెలికి వస్తున్నాయి. కనుక, ఇది స్నేహ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపి తీరుతుంది.
మూడు ముఖ్య సంగతులు
వ్యూహ పత్రం విషయానికొస్తే, ఇంతవరకు మూడు సంగతులు స్పష్టమయ్యాయి. ఒకటి–దాడులు, ప్రమాదాల నుంచి సామూహిక స్వీయ రక్షణకు ‘ఒక గ్రూపు’గా ఏర్పడే ధోరణిని కొనసాగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాలను ‘బయటి’ శక్తులకు ‘అందని దుర్గాలు’గా ప్రకటించి, పశ్చిమ అర్ధ గోళంపై పట్టు సంపాదించాలనుకుంటున్నారు. కొన్ని విధాలుగా ఇది ఆసియాలోని అభిప్రాయాలనే ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోని ఈ భాగంవారు కూడా అమెరికాను ‘బయటి’ శక్తిగానే భావిస్తారు. అయితే, ఆసియా నుంచి అమెరికా సేనలను ట్రంప్ ఉపసంహరించుకుంటారనీ, ఈ ప్రాంత భద్రతను ప్రాంతీయ శక్తుల చేతులకే విడిచిపెడతారనీ అనడానికి ఆధారాలు కనిపించడం లేదు.
రెండు– మిగిలిన వాటన్నింటి కన్నా చైనాతో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా అటు సవాల్‌గానూ, ఇటు సమ వుజ్జీగా పరిగణించి వ్యవహరించవలసిన శక్తిగానూ కూడా ఉంది. ‘జి–2’ ఆలోచనతో ఆయన చేసిన ట్వీట్ ఆసియాలో కలకలం సృష్టించింది. ఇంచుమించు రష్యా కోరుకుంటున్న విధంగానే, యూరప్‌లో యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మూడు పెద్ద (అమెరికా, రష్యా, చైనా) శక్తులు తమ భద్రత, పరపతి ఉన్న ప్రాంతాలకు పరిమితమయ్యే హక్కు ఉందనే లోపాయకారీ అవగాహనను బలపరుస్తున్నారు. కానీ, భారత్‌పై దీని పర్యవసానాలుంటాయి.
చివరగా, వ్యూహ పత్రాన్ని అమెరికా విరమణ ప్రకటనగా, దేశ, విదేశాలలో ముఖ్యంగా యూరప్‌లో చాలా మంది భాష్యం చెబుతున్నారు. కానీ, ఆ రకమైన నిర్ధారణకు రావడం ట్రంప్ ప్రపంచ వీక్షణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి దాని వ్యూహ పత్రంలో ఎక్కడా ఒక్క మాట లేదు.
అమెరికా శైలి మాఫియా
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 750 సైనిక స్థావరాలలో 1,60,000కు పైగా అమెరికా సైనిక దళాలు న్నాయి. అమెరికా సాయుధ దళాలున్న అత్యంత ముఖ్యమైన కేంద్రాలు జర్మనీ, జపాన్, ఇటలీ, కొరియాలలో ఉన్నాయి. అవి రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచి అమెరికా ‘అధీనం’లో ఉన్నాయి. ‘నాటో’ కూటమి దేశాల్లోనూ, పశ్చిమాసియా ‘క్లయింట్’ దేశాల్లో ముఖ్యంగా బహరైన్, కువైట్‌లలోనూ అమెరికా సైనిక స్థావరాలున్నాయి.
ఈ స్థావరాల నిర్వహణకు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయి. సేనలు లేదా స్థావరాల సంఖ్యను తగ్గించుకోవడం గురించి వ్యూహ పత్రం ఎక్కడా మాట్లాడలేదు. మరింతగా ‘భారాన్ని పంచుకోవలసిన’ అవసరం గురించి మాత్రం అది ప్రస్తావించింది. ‘నాటో’ కూటమి దేశాలు, జపాన్, కొరియా, గల్ఫ్ దేశాలు వాటి రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని అమెరికా కోరుతోంది. ఇతర దేశాల్లో అమెరికా సేనల ఉనికి అవసరం ఏమిటో, అది ఎంతకాలమో, ట్రంప్ గానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా అధ్యక్షులైన ఇత రులు గానీ వివరించిన పాపాన పోలేదు.
భారతదేశంతో సహా ఇంకా అనేక దేశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాల రీత్యా మాత్రమే అమెరికా సేనలు పరిమిత సంఖ్యలో కనిపి స్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగానే, కొన్ని దేశాల్లో అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది వాస్తవం. ఆ యుద్ధం ముగిసేనాటికి అమెరికా ‘విముక్తి’ కల్పించిన ‘ఆక్రమించిన’ దేశాల్లో అమెరికా సేనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వ్యూహ పత్రం, ఆ యా భూభాగాల నుంచి సేనల ఉపసంహరణ లేదా తగ్గింపునకు పిలుపు ఇవ్వలేదు. అవి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా సేనల నిర్వహణకు ఆయా దేశాలు కొంత పైకాన్ని చెల్లించాలని మాత్రమే అది అడుగుతోంది. ఇది కళాత్మక మాఫియా శైలి అవుతుంది. ఇతర పెద్ద శక్తుల నుంచి ఎదురు కాగల బెడద నుంచి ‘రక్షణ’ కల్పిస్తున్నందుకు ‘మామూలు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నమాట!
ఇది చూడండి: యూరప్, ఆసియాలలో శక్తిమంతమైన సైనిక యంత్రాలుగా చైనా, రష్యా నడుచుకునేందుకు అమెరికా అనుమతి స్తుంది. చైనా, రష్యా పొరుగునున్న దేశాలు ప్రపంచ శక్తి అయిన అమెరికా పెత్తనం నుంచి తమను కాపాడుకునేందుకు ఈ ప్రాంతీయ శక్తుల పంచన చేరవచ్చు. ఇక సేనల తగ్గింపు ప్రసక్తి ఎక్కడ? ట్రంపి జంగా అభివర్ణించదగిన ఈ విధానంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉండబోతోందన్నది 2020లలో కాలగతిని నిర్వచించనుంది.
సంజయ బారు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్


