ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మత విద్వేషంతో సమాజానికి నష్టం
‘ఉపాధి’ని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర
జనవరి 26న ఖమ్మంలో కాంగ్రెస్ జెండా పండుగ
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
ఖమ్మం మయూరి సెంటర్: దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాలమే మార్గమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో వందల ఏళ్లుగా కుల, మత విభేదాలు లేకుండా జీవిస్తున్న ప్రజల మధ్య కొందరు రాజకీయ లబ్ధి కోసం ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అలాంటి చర్యలు సమాజానికి తీరని నష్టం కలిగిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని భట్టి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గొప్ప ఆశయంతో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెస్తే ప్రస్తుత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ పథకాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర పన్నుతోందని భట్టి ఆరోపించారు.
పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించిందని.. ఈ వైఖరిని ఎండగట్టేలా ఏఐసీసీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ, పార్టీ పాలిత ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు అమలు చేశాయో వివరించేందుకు జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో జరిగే వేడుకలకు తాను హాజరవుతానని భట్టి తెలిపారు. ఆ రోజు ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగరాలని, కాంగ్రెస్ భావజాలాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచాలని పిలుపునిచ్చారు.
పంచవర్ష ప్రణాళికలతోనే ఆర్థికాభివృద్ధి
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉందని, ఆ తర్వాత హరిత విప్లవం, శ్వేత విప్లవం, పంచవర్ష ప్రణాళికల అమలుతో దేశ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. నేడు ప్రపంచానికి ఆహార ధాన్యాలు సరఫరా చేసే పరిస్థితిలో దేశం ఉందంటే అది కాంగ్రెస్ ఘనతేనని చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేందుకు 20 సూత్రాల కార్యక్రమం అమలు చేసిందీ కాంగ్రెస్ పారీ్టయేనని గుర్తుచేశారు. బ్యాంకులను జాతీయం చేసి సామాన్యుడు కూడా రుణం తీసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.
అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలతో పోటీపడేందుకు ఐఐటీలు, ఐఐఎంలు కాంగ్రెస్ హయాంలోనే ఏర్పాటయ్యాయని, అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలుగా భారతీయులు రాణిస్తున్నారంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచి్చన ఐఐఎం వంటి మేనేజ్‌మెంట్ సంస్థలే కారణమని వివరించారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం మహిత్మా గాం«దీ, ఇందిరాగాం«దీ, రాజీవ్ గాంధీ తమ జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని చెప్పారు.
మహిళా సాధికారత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ ద్వారా నిధుల కేటాయింపు వంటివి తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. భారతజాతి ఔన్నత్యం కోసం కాంగ్రెస్ జెండా తిరిగి రెపరెపలాడాలని, ఇందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధుడై పనిచేయాలని భట్టి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి శుభాష్ తదితరులు పాల్గొన్నారు.


