కాంగ్రెస్‌కు కలిసి వచ్చిన 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ విజయంతో కొత్త ఉత్సాహం
7 వేలకు పైగా పంచాయతీల్లో ఆధిపత్యం
వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర ముఖ్య పోస్టుల భర్తీలో తాత్సారం
సాక్షి, హైదరాబాద్: రెండు కీలక ఎన్నికల్లో గెలుపు.. రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ...రెండు మినహా అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల ఎంపిక.. ఇద్దరు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు కోర్టు ఉద్వాసన.. మరో ఇద్దరి పేర్లకు మంత్రివర్గం ఆమోదం..పీసీసీలో రెండు రకాల పోస్టుల భర్తీ. ఇలా 2025లో అధికార కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ భారీ విజయం సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడింట రెండొంతుల గ్రామాల్లో తన పట్టును నిరూపించుకుంది. మరో మూడేళ్ల పాటు పార్టీ అధికారంలో కొనసాగనున్న నేపథ్యంలో..రాష్ట్రవ్యాప్తంగా మరింత బలపడేలా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అయితే పార్టీ కేడర్‌కు ఎలాంటి పదవులు దక్కకుండానే 2025 వారి నుంచి వీడ్కోలు తీసుకోనుండటంతో..ఈ ఏడాది వారికి మాత్రం నిరాశ మిగిల్చిందనే చెప్పాలి.
2025లో పార్టీ పరంగా కొన్ని ముఖ్య పరిణామాలు
» రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. జూన్‌లో జరిగిన మలి విడత విస్తరణలో మంత్రులుగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేయగా, అక్టోబర్‌లో అనూహ్యంగా జరిగిన మరో విస్తరణ ద్వారా మహ్మద్ అజహరుద్దీన్ కేబినెట్‌లో చేరారు.
» ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. సీఎం రేవంత్ పాలనా దక్షతా, పార్టీ సమష్టి కృషిని ఈ ఎన్నిక నిరూపించిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్టును నిరూపించాయి. ఆ పార్టీ మద్దతుదారులు 7 వేల మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు.
» ఈ ఏడాది అక్టోబర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలకు.. పి. సుదర్శన్‌రెడ్డి (బోధన్), కె. ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల)లకు ప్రభుత్వ సలహాదారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు లభించాయి.
» ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమేర్ అలీఖాన్‌ల నియామకాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఉద్వాసన పలికింది. దీంతో మరోసారి కోదండరాంతో పాటు అజహరుద్దీన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
» రాజకీయంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టి ముందుకు తీసుకెళుతోంది. సంవిధాన్ బచావో పేరుతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు నిర్వహించారు.
బలహీనంగానే సంస్థాగతం
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలోపేతం కావాల్సి ఉన్నా తెలంగాణ కాంగ్రెస్‌లో రెండేళ్లుగా అది సాధ్యపడడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించగా, ఆ తర్వాత చాలా రోజులకు పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఆ తర్వాత రెండు మినహా అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఈ ఏడాది ఫిబ్రవరి లోనే మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటికీ క్షేత్రస్థాయి సంస్థాగత ప్రక్రియ అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. పీసీసీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్, పీసీసీ కార్యవర్గం, అధికార ప్రతినిధుల నియామక ప్రక్రియలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నా యి. జిల్లా అధ్యక్షులను ఎంపిక చేశారు కానీ పార్టీ కార్యవర్గం, మండల, బ్లాక్, గ్రామ అధ్యక్షుల ఎంపిక లాంటి సంస్థాగత కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.
అలాగే క్షేత్రస్థాయిలో పనిచేసి, అధికారంలో లేని పదేళ్ల కాలంలో పార్టీ జెండాను మోసిన నేతలకు నామినేటెడ్ పోస్టులిచ్చే ప్రక్రియలోనూ ముందడుగు పడలేదు. అప్పుడెప్పుడో అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత అడపాదడపా ఒకరికో, ఇద్దరికో పదవులివ్వడం మినహా పూర్తి స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టుల భర్తీ ఇంకా పూర్తి స్థాయిలో కాకుండానే 2025 సంవత్సరం ముగిసిపోయింది.


