కెనడాలో సౌత్‌ ఇండియన్‌ సినిమాల ప్రదర్శన నిలిపివేత! | OG, Kantara, Other Indian Films Screening Stopped In Canada Reason Is? | Sakshi
Sakshi News home page

కెనడాలో సౌత్‌ ఇండియన్‌ సినిమాల ప్రదర్శన నిలిపివేత!

Oct 3 2025 11:05 AM | Updated on Oct 3 2025 11:20 AM

OG, Kantara, Other Indian Films Screening Stopped In Canada Reason Is?

కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్‌ కల్యాణ్‌ ఓజీ, రిషబ్‌ శెట్టి కాంతార చాప్టర్‌-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్‌పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.

అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్‌పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్‌ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్‌ ఎంట్రెన్స్‌ వద్ద లిక్విడ్‌ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్‌ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్‌ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని  అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్‌విల్లేలోని ఫిల్మ్‌.సీఏ సినిమాస్‌(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్‌ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్‌ నోల్‌ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.

ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్‌లైన్‌ బుకింగ్‌ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్‌మండ్‌ హిల్‌లోని యార్క్‌ సినిమాస్‌ కూడా ఫిల్మ్‌.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్‌ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్‌​​ సినిమాస్‌ వెల్లడించింది. గ్రేటర్‌ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్‌లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్‌ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. 

ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్‌ బ్లడ్‌కి పట్టమా??

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement