
మనం ఉపయోగించే షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. కేవలం షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్ క్రీమ్ లాంటి వాటిని ΄్యాక్ చేసే కొన్ని సీసాలతో పాటు తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న డ్రింకింగ్ బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువు పెరగడానికి కారణమవుతోందన్న విషయాన్ని గత కొద్దిరోజుల ముందర నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనతో తెలిసింది.
ఈ అధ్యయనంలో భాగంగా 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లో ఉంచిన దాదాపు 55,000 రకాల రసాయనాలను పరీక్షించారు. వీటిల్లో పదకొండు రకాల రసాయనాలు బరువు పెరగడానికి కారణ మవుతాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన, ఆ సంస్థకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ తెలిపారు. ఆ ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించినప్పుడు మన దేహంలోకి ప్రవేశించే ఆ పదకొండు రకాల రసాయనాల వల్ల బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ (Obesogens) అని పేర్కొంటున్నారు.
మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ మన దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడంతో పాటు కొవ్వు నిండి ఉండే ఫ్యాట్ సెల్స్‌ను పెరిగిపోయేలా చేయడం వల్ల దేహం బరువు అకస్మాత్తుగా పెరుగుతోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. అంటే ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నాడీ సంబంధమైనవి, వ్యాధినిరోధకతను తగ్గించేవి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగడమే కాదు... ఇప్పుడు తాజాగా బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టమైంది. బరువు పెరగడం వల్ల... స్థూలకాయం కారణంగా ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. ఈ అధ్యయన వివరాలన్నీ‘ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
బరువు పెంచి ఒబేసిటీని కలిగిస్తోంది కాబట్టి ఆ ప్లాస్టిక్ పదార్థాలకు ‘ఒబిసోజెన్స్’ అని పేరు!
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే..
ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించాల్సి వస్తే... వాటిపై ‘మైక్రోవేవ్ సేఫ్’ అని రాసి ఉన్నవే వాడాలి. అవి మైక్రోవేవ్ ఒవెన్‌లో పెట్టినా కరగవు. లేకపోతే ఆ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ ఎంతో కొంత కరిగి ఆహారంలో కలిసి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి.
ప్లాస్టిక్ వస్తువులను కఠినమైన డిటర్జెంట్స్ మోతాదులు ఎక్కువగా ఉండే డిష్‌వాషర్స్‌లో ఎక్కువసేపు నానబెట్టి ఉంచడం సరికాదు.
పిల్లల పాలకోసం గ్లాస్‌తో చేసిన ప్లాల సీసాలు ఉపయోగించడమే మంచిది. ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించే ప్పుడు వాటిలో వేడి వేడి పాలు పోయకూడదు.
ఆహారాన్ని ఉంచడం కోసం ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు మంచివని గుర్తుంచుకోవాలి.
కొన్ని లంచ్‌బాక్స్‌లు మూత సాగినట్లుగానూ, కింద ఉన్న కంటెయినర్ కాస్త సాగిపోయి షేప్ చెడిపోయినట్లు గానూ ఉంటాయి. ఇలా సాగి ఉన్నట్లుగా ఉన్న ఆహారపు డబ్బాలను ఏమాత్రం ఉపయోగించ కూడదు.
చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!
ఇక మనం రోజూ నీళ్లను నిల్వ చేసుకోడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ముల వంటి వాటిని కేవలం నీళ్ల నిల్వ కోసం తయారు చేసినవాటినే ఉపయోగించాలి. అయితే చాలామంది కొన్ని రకాల రసాయనాలను (కెమికల్స్) నిల్వ ఉంచడానికి వాడిన వాటిని కడిగి వాటిని నీళ్ల నిల్వ కోసం వాడుతుంటారు. ఇలాంటివి కూడా అంత మంచిది కాదు.