మానసిక స్వస్థతపై దృష్టిమన దేశంలో ప్రభుత్వాలకూ, సమాజానికీ, కుటుంబానికీ – ఎవరికీ పట్టని అత్యంత కీలకమైన సమస్యల్లో మానసిక అనారోగ్యం ఒకటి. ఆ రోగులకు కూడా హక్కులుంటా యనీ, వాటినీ పరిరక్షించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి చెప్పి రెండు దశాబ్దా లవుతోంది. మానసిక అస్వస్థుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని 2007లోనే సూచించింది.
వేరే దేశాల మాట అటుంచి పదేళ్లపాటు మన దేశమే ఆ సంగతి పట్టించుకోలేదు. 75 ఏళ్లుగా కొనసాగుతున్న కాలం చెల్లిన చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి
2017లో పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఏం లాభం? అటుతర్వాత నుంచి దేశంలో మానసిక అస్వస్థతకు లోనవుతున్నవారి స్థితిగతులేమిటో, వారికి అందించాల్సిన సహాయ సహకారాలేమిటో కేంద్రానికీ, రాష్ట్రాలకూ కూడా అక్కర లేకపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బెంగళూరులోని నిమ్‌హాన్స్ ఆధ్వర్యాన ద్వితీయ సర్వే జరగబోతోంది. 2015–16లో జరిగిన తొలి సర్వే వయోజ నుల్లో మానసిక అస్వస్థతపై దృష్టి పెట్టగా, ఈసారి పిల్లలు, మహిళలు, వలసదారులతో పాటు వృద్ధుల్లో సైతం మానసిక స్థితిగతులెలా ఉన్నాయో ఆరా తీయాలని ఆ సంస్థ నిర్ణయించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యం గురించి ఇచ్చిన నిర్వచనం సమగ్రమైనది. ఒక మనిషి తనకున్న శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకోగల స్థితిలో ఉండి, జీవితంలో ఎదురయ్యే సాధారణ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తన ఉత్పాదకతతో సమాజ పురోగతికి దోహదం చేయగల శ్రేయోస్థితిని మానసిక ఆరోగ్యంగా ఆ సంస్థ నిర్వచించింది. కేవలం మానసిక వైకల్యం లేదా అస్వస్థత లేకపోవటం మాత్రమే ఆరోగ్యకరమైన మానసిక స్థితిగా చూడలేమని ఈ నిర్వచనం చెబుతోంది. ఒక అంచనా ప్రకారం మన వయోజ నుల్లో 15 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికం. అక్కడ 13.5 శాతం మందికి మానసిక సమస్యలు, ఒత్తిళ్లు ఉండగా... పల్లెసీమల్లో ఇది 6.9 శాతం. శరవేగంతో సాగే పట్టణీకరణ, ఉద్యోగ అభద్రత, జీవన వ్యయం పెరగటం, వృత్తిలో నానాటికీ అధికమయ్యే పోటీ, సామాజిక మాధ్యమాలను అతిగా చూడటం, ఫోన్‌తో అధిక సమయం గడపటం, ఆన్‌లైన్ వేధింపులు వగైరాలు సమస్యకు కారణమవుతున్నాయి.
దురదృష్టమేమంటే ఇతర సమస్యల్లా మానసిక అనారోగ్యాన్ని వెనువెంటనే గుర్తించటం సాధ్యం కాదు. తమను చిన్నచూపు చూస్తారనే భయంతో ఆ స్థితిలోకెళ్లినవారు ఎవరికీ చెప్పుకోరు. తొలి దశలో వారిని గుర్తించటం కూడా కష్టం. అలాంటివారు అప్పుడప్పుడు అస్వాభావికంగా, అసహజంగా లేదా విచిత్రంగా ప్రవర్తించినా అది ఆ క్షణంలో వచ్చిపడిన సమస్యకు తక్షణ స్పందనగా పరిగణిస్తారు. తీరా గుర్తించేసరికి అప్పటికే చేతులు దాటిపోయిన స్థితి ఏర్పడవచ్చు. అందుకే ఈసారి సర్వే మానసిక అనారోగ్యం విస్తృతి ఎలావుందో, దాని పర్యవసానంగా వచ్చే వైకల్యం, అందువల్ల సామాజికార్థిక స్థితిగతుల్లో మార్పు, అలాంటివారి సంరక్షణకు తోడ్పడే మార్గాలు, సేవల లభ్యత వగైరాలను కూడా పరిశీలించబోతోంది. సమాజంలో ఎక్కువగా ఏయే గ్రూపులు ఇలాంటి అనారోగ్య స్థితికి లోనవుతున్నాయో, వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
మన దేశంలో జనాభాకు తగినట్టు వైద్యులు లేరు. ఇక మానసిక అనారోగ్యానికి చికిత్స చేసేవారైతే చాలా అరుదు. లక్షమందికి కనీసం ముగ్గురు మానసిక వైద్యులుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. కానీ మనకు లక్షమందికి 0.75 శాతం మందే ఉన్నారు! 2022లో కేంద్రం టెలీ–మానస్ పేరుతో మానసిక ఆరోగ్య కార్యక్రమం మొదలుపెట్టింది. దానికి రోజుకు సగటున 2,500 ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే ఈ సమస్య ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇకనైనా సమగ్ర విధాన రూపకల్పనపై దృష్టి సారించాలి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకూ కౌన్సెలర్లు తగినంత మంది అందుబాటులో ఉండేలా, ప్రజల్లో దీనిపై అవగాహన పెరిగేలా చూడాలి. ఈ సమస్య వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టంతో పోలిస్తే దానికి కేటాయించే నిధులు పెద్ద ఎక్కువేం కాదు.


