జపాన్‌లో అమలవుతున్న మెటబో చట్టం
వ్యక్తుల నడుము చుట్టు కొలతకు పరిమితి
మించితే కంపెనీలు, ప్రభుత్వ శాఖలదే బాధ్యత
సోషల్ మీడియాలో ఈ చట్టంపై విస్తృత చర్చ
ఊబకాయం.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్, అధిక కేలరీలతో కూడిన స్నాక్స్, చక్కెర పానీయాల వినియోగం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం ఊబకాయానికి ప్రధాన కారణం. శారీరక శ్రమతోపాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే దీనికి పరిష్కారం. అయితే ఊబకాయంపై పోరు కోసం జపాన్‌లో ఓ చట్టం ఉందని మీకు తెలుసా? – సాక్షి, స్పెషల్ డెస్క్
ఒక అడుగు ముందుకేసిన జపాన్
బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలకే పరిమితం అవుతున్నాయి. అయితే జపాన్ ఒక అడుగు ముందుకేసి 2008లో ‘మెటబాలిక్ సిండ్రోమ్ కౌంటర్ మెజర్స్ ప్రమోషన్ లా’అమలులోకి తెచ్చింది. దీనిని సింపుల్‌గా మెటబో చట్టం అని పిలుస్తారు.
పురుషులకు నడుము చుట్టుకొలత 85 సెంటీమీటర్లు (సుమారు 33.5 అంగుళాలు) మించి ఉండటం హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. మహిళలకు ఈ పరిమితి 90 సెంటీమీటర్లు (సుమారు 35.4 అంగుళాలు). ఒబెసిటీ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేలా ఇది పౌరులు పాటించే సామాజిక ఒప్పందం లాంటిది. జపాన్ ప్రవేశపెట్టిన ఈ అసాధారణ చట్టం మరోసారి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
ఆరోగ్యకరమైన జీవనశైలి..
సమస్య తీవ్రం కాకముందే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించడానికి మెటబో చట్టం ప్రకారం 40 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులందరికీ ఏటా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేపడతారు. ఈ తనిఖీలో కీలకమైన అంశం ఏమంటే వ్యక్తుల నడుము చుట్టుకొలతను కొలుస్తారు. జీవక్రియ రుగ్మతలతో ముడిపడి ఉన్న హానికరమైన విసెరల్ కొవ్వు స్థాయిని అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.
పరిమితి దాటితే స్థానిక ప్రభుత్వ విభాగాలు, కంపెనీలు రంగంలోకి దిగి ఉచిత ఆరోగ్య సాయం చేస్తాయి. విసెరల్ ఫ్యాట్ అంటే కాలేయం, పేగులు, క్లోమం వంటి అంతర్గత అవయవాల చుట్టూ నిల్వ అయిన కొవ్వు. సమస్య కొనితెచ్చుకొని చికిత్సలు చేయించుకునే బదులు.. అనారోగ్యానికి మూలకారణాన్ని లక్ష్యంగా చేసుకొని మొదటి నుంచీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని జపనీయులు నమ్ముతారు. శతాధిక వృద్ధులు అత్యధికంగా ఉన్న దేశమూ ఇదే కావడం విశేషం.
సమస్యలకు మూలం..
స్థూలకాయం అనేది అనేక దేశాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, డైజెస్టివ్, కిడ్నీ డిసీజెస్ ప్రకారం..అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, టైప్–2 డయాబెటిస్, వివిధ కేన్సర్లు, మూత్రపిండాల సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందుల వంటి ఆరోగ్య ప్రమాదాలకు స్థూలకాయం కారణమవుతోంది.
అవగాహన పెరిగింది..
మెటబో చట్టాన్ని నేటికీ పౌరులు అనుసరిస్తున్నారు. ఏటా 5.5 కోట్ల మందికి పరీక్షలు జరుపుతున్నారు. ‘పెద్దల్లో ఊబకాయం రేట్లు స్థిరమైన ధోరణిని చూపిస్తున్నాయి. ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు ’అని జపాన్ అధికారులు చెబుతున్నారు.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే జపాన్‌లో ఊబకాయం సమస్య నియంత్రణలో ఉందని తెలుస్తోంది. ఈ చట్టంపై తాజాగా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఈ చట్టాన్ని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చేసిన ఆరోగ్య చర్యగా ప్రశంసిస్తుండగా.. మరికొందరు సుమో రెజ్లర్ల వంటి వారికి ఇది ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పరిమితి దాటితే..
» నిర్దేశిత పరిమితి మించి నడుము చుట్టుకొలత ఉంటే జరిమానా లేదా శిక్ష విధించరు.
» ప్రమాదం పొంచి ఉన్న వారికి ప్రభుత్వ మద్దతుతో ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తారు.
» ఇందుకు కంపెనీలూ తమ ఉద్యోగులకు సహాయం చేస్తాయి... తీసుకోవాల్సిన పోషకాహారంపై నిపుణులతో కౌన్సెలింగ్ ఉంటుంది.
» వ్యాయామాలు, ఆరోగ్యకర జీవనశైలికి ఫాలో–అప్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
» జిమ్నాస్టిక్స్, క్రీడా పోటీలను కంపెనీలు నిర్వహిస్తున్నాయి.
» మూడు నెలల తర్వాత పురోగతిని సమీక్షిస్తారు.
» ఆరు నెలల తర్వాత అవసరమైతే మరోసారి ఆరోగ్య అవగాహన కల్పిస్తారు.
బాధ్యులు ఎవరంటే..
» జపాన్ ప్రభుత్వ లక్ష్యం పౌరులను శిక్షించడం కాదు. జీవనశైలి సంబంధిత వ్యాధులు తీవ్రం కాకముందే వాటిని నివారించడం.
» దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యం.
» ఉద్యోగులు లేదా నివాసితుల నడుము చుట్టుకొలతలు తగ్గించే బాధ్యత కంపెనీలు, స్థానిక ప్రభుత్వ శాఖలదే. » » ఈ లక్ష్యాలను చేరుకోలేకపోతే కంపెనీలు లేదా స్థానిక ప్రభుత్వ శాఖలు భారీ జరిమానా చెల్లించాల్సిందే.
» ఈ మొత్తాలను ఆరోగ్య సంరక్షణ నిధులకు మళ్లిస్తారు.


