జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ విల్ మలాజ్‌చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ పేరిట ఉండేది. ఖాసిమ్ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
మలాజ్‌చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.
ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ హ్యూగో కెల్లీ (79 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్ పర్మార్ (33), చార్లెస్ హింజ్ (24), హర హింజ్ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్ బౌలర్లలో కూరే 3, విల్ బైరోమ్ 2, ఆర్యన్ శర్మ, కేసీ బార్టన్ తలో వికెట్ తీశారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. మలాజ్‌చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ (60 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.


