ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేయడం, తిరిగి ఏమీ ఆశించక΄ోవడం అనే భారతీయ సంస్కృతిని జపాన్ వేదికగా చాటి చెప్పాడు ఓ భారతీయుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతూ అందరి హృదయాలను గెలుచుకుంటోంది. రోహన్ రానా అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి జపాన్‌లో మెట్రో ట్రైన్‌ని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుండగా.. ఓ వృద్ధుడైన జపనీస్ వ్యక్తి కిందపడి ఉండటాన్ని గమనించారు. ఆ వృద్ధుడికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది.
చుట్టూ చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ ఆ వృద్ధుని పట్టించుకోలేదు. కానీ రోహన్‌రానా, అతని స్నేహితుడు క్షణం కూడా ఆలోచించకుండా అతనికి సాయం చేయడానికి ముందుకెళ్లారు. ఆ వృద్ధుడికి చేయూతనిచ్చి కూర్చోబెట్టి, తమ వద్ద ఉన్న బ్యాండేజీని గాయంపై వేసి, అతనికి ధైర్యం చెప్పారు. కృతజ్ఞతగా ఆ వృద్ధుడు రోహన్‌కి కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ రోహన్ ఆ డబ్బును నిరాకరించాడు. అనంతరం రోహన్ ఆ విషయాన్ని చెబుతూ ఆ వృద్ధుడు ఇచ్చిన డబ్బుని చూడటం కూడా తనకు నచ్చలేదని, అది ఒక భారతీయుడిగా తన వ్యక్తిగత విలువలకు విరుద్ధమని భావోద్వేగానికి లోనయ్యాడు. సాటి మనిషిపై చూపిన జాలి, మానవత్వం భారతీయుల విలువలకు అద్దం పడుతోంది.


