
న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు షాక్ తగిలింది. స్టడీ పర్మిట్‌లలో పోనుపోను భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. తాజాగా వెల్లడైన ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) గణాంకాలు ఈ వివరాలను తేటతెల్లం చేశాయి.
2025 తొలి త్రైమాసికానికిగానూ కేవలం భారతీయ విద్యార్థుల కోసం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే కిందటి ఏడాది ఇదే సమయంలో 44, 295 పర్మిట్లు జారీ అయ్యాయి. అంటే.. దాదాపు 31 శాతం తగ్గిందన్నమాట.
2023 చివరి నుంచి వలసదారుల రాకను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే.. స్టడీ పర్మిట్లను తగ్గిస్తూ వస్తున్నారు. రికార్డు స్థాయిలో వలసల వల్ల కెనడాపై అన్ని రకాలుగా తీవ్ర భారం పడుతోందని అక్కడి లిబరల్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. 2028 నాటికల్లా కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులు, విదేశీ ఉద్యోగులు.. విద్యార్థులు కలిపి 5 శాతానికి మించి ఉండకూదంటూ ప్రధాని మార్క్ కార్నీ ఒక ప్రకటన చేశారు.
ఇక గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్‌లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.
2023లో.. కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. ఇందులో భారతీయులకు జారీ చేసింది 2, 78,045
2024కి వచ్చేసరికి.. మొత్తం 5,16,275 పర్మిట్లు జారీ చేయగా.. అందులో భారతీయుల కోసం జారీ చేసింది 1,88,465
2025 నాటికి.. ఈ ఏడాదికిగానూ తొలుత 4,85,000 పర్మిట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 4,37,000 పర్మిట్లు మాత్రమే జారీ చేయాలని ఐఆర్‌సీసీ ఇప్పుడు భావిస్తోంది. ఇందులో భారతీయల పర్మిట్ల సంఖ్యను లక్షకు పరిమితం చేయాలని భావిస్తోందని స్పష్టమవుతోంది.
2026 కల్లా.. ఈ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గించే యోచనలో ఉంది. మరోవైపు స్టడీ పర్మిట్ల దరఖాస్తుల కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా మారాయి.