
సాధారణంగా అమ్మవారికి భక్తులు రకరకాల నైవేద్యాలను వండి ప్రసాదాలను సిద్ధం చేయడం సంప్రదాయం. అయితే ఇక్కడ మాత్రం అమ్మవారు తన నైవేద్యాన్ని తనకు నచ్చిన విధంగా తానే వండుకుంటుంది. అందుకోసం నాణ్యమైన సరుకులు, మసాలా దినుసులు, వంట చెరకు, వంటపాత్రలు సమకూరిస్తే సరి΄ోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, పశ్చిమ బెంగాల్ ఝార్‌గ్రామ్‌లోని చిల్కిగఢ్ రాజభవనంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం ఇది.
స్థానికంగా ‘విరామ భోగ్‘ అని పిలుచుకునే అష్టమి రోజున అమ్మవారు తనకు సమర్పించిన నైవేద్యాన్ని తానే స్వయంగా వండుతుందని నమ్ముతారు. చిల్కిగఢ్ రాజభవనంలో, అష్టమి పూజ పూర్తయిన తర్వాత, ఆలయ ప్రధాన పూజారి ఒక కొత్త మట్టి కుండలో నీరు, బలి మాంసం, ఇతర పదార్థాలను నింపుతాడు. పూజారి మేక బలి మాంసంతో ఏకాంతంగా వంటగదిలోకి ప్రవేశిస్తాడు. సంప్రదాయం ప్రకారం, మాంసాన్ని కొత్త మట్టి కుండలో ఉంచుతారు. దానిలో వివిధ మసాలా దినుసులు కలుపుతారు.
తరువాత, మూడు కట్టెలను పొయ్యిలో ఉంచుతారు. ఆ మట్టి కుండను సాల్ చెట్టు ఆకులతో కప్పి, గదిలో పొయ్యిపై పెట్టి, కుండ పక్కన ఒక కొయ్య గరిటె ఉంచుతారు. పొయ్యిలో మూడు కట్టెలు వెలిగించిన తర్వాత, గది బయటి నుండి తాళం వేస్తారు. నవమి రోజు ఉదయం, పూజారి రాజభవనం నుండి తాళం తీసుకుని వచ్చి, ఆ వంటగది తలుపు తెరిచి చూసి, అమ్మవారికి ‘భోగ్‘గా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు.
అమ్మవారే స్వయంగా వచ్చి ఈ భోగ్‌ను వండుకుంటుందని విశ్వాసం. ఈ విషయాన్ని చిల్కిగఢ్ రాజ్‌బరి ప్రస్తుత వారసుడు తేజసచంద్ర దేవ్ ధబల్‌దేవ్ స్వయంగా తెలియజేశారు. అమ్మవారు తమ పూర్వికులకిచ్చిన సూచనల మేరకు ఈ విధంగా చేస్తున్నట్లు తెలియజేశారు.
(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..)