సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తన పైరసీ సినిమా గుట్టు బయటపడ్డాక తప్పించుకునేందుకు ప్లాన్ చేసిన రవి.. తనపై ఫిర్యాదు చేసిన సినిమా పెద్దలను ఇరికించాలని చూశాడు. కానీ, అందులో తానే ఇరుక్కున్నాడు. ఐబొమ్మ రవిని 12 రోజులపాటు పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా పలు విషయాలు బయటకు వచ్చాయి.
నగర సైబర్ క్రైమ్ పోలీసుల బృందం వివిధ కోణాల్లో రవి నుంచి సమాధానాలు రాబట్టారు. అతడు చేసే నేరాలకు ఎప్పటికీ దొరక్కూడదని 2007 నుంచే, తన క్రిమినల్ బుర్రకు పదునుపెట్టి తాను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రులను పావులుగా వాడుకున్నాడని పోలీసులు గుర్తించారు. 2019-23 మధ్య కాలంలో ప్రకటనల ద్వారా రూ. మూడు కోట్లు సంపాదించినట్టు తెలుసుకున్నారు. అయితే, విచారణ సందర్బంగా అతను ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా సమాధానం చెప్పినట్టు తెలిసింది. అదే ప్రశ్న మరోసారి అడిగితే కళ్లు ఉరిమి చూస్తున్నట్టు సమాచారం.
విచారణలో భాగంగా.. రవి ఐ బొమ్మ తదితర సైట్లలో పైరసీ సినిమాలు పెట్టాడు. తరువాత పైరసీ వెబ్‌సైట్లు మరిన్ని పెరగటంతో అతడి ఆదాయం తగ్గింది. అదే సమయంలో పైరసీపై తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఫిర్యాదు చేయడంతో రవి నయా మార్గం ఎంచుకున్నాడు. అప్పటికే కాలపరిమితి ముగిసిన ఐ బొమ్మ డూప్లికేట్ పోర్టల్ వేదికగా పోలీసులకు సవాల్ విసిరాడు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, బయటి వ్యక్తులు ఇదంతా నడిపిస్తున్నారని సినీ పెద్దలనే ఇరికించే ప్రయత్నం చేశాడు.
ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
వీఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను రిజిస్టర్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ కంపెనీకి మెయిల్ పంపారు. తాను ఆ డొమైన్లకు సర్వీసు ఇస్తున్నాడని, ఆ పోర్టల్‌లో ఎలాంటి పైరసీ సినిమాలు లేవని బుకాయిస్తూ రవి సమాధానమిచ్చాడు. అందుకు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే తనకు పంపాలంటూ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. వీఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ఫోన్ నంబరు ఆధారంతో నిందితుడు విదేశాల్లో ఉంటూ కథ నడిపిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌కు పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సరిగ్గా అదే సమయంలో అతడి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. తాను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చానంటూ రవి పంపిన మెసేజ్ పంపాడు. దాని ప్రకారం, కూకట్‌పల్లిలోని తన ఇంటికి రవి చేరుకున్నాక తనని అరెస్ట్ చేశారు.

ఫోర్జరీలు, నకిలీ సంతకాలు..
రవి 2007లోనే మహారాష్ట్రలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని సంపాదించాడు. వాటితోనే పాన్‌కార్డు కూడా పొందాడు. వాటి ఆధారంగా పోలీసులు రవికి పరిచయమున్న ప్రహ్లాద్, కాళీప్రసాద్, అంజయ్యలను గుర్తించారు. రవిని గుర్తించేందుకు ఇటీవల ప్రహ్లాద్‌ను రప్పించారు. అమీర్‌పేట్‌లో తాను రవితో కలిసి ఉన్నానని ప్రహ్లాద్ చెప్పగా, రవి మాత్రం ప్రహ్లాద్‌ను ఇదే మొదటిసారి చూస్తున్నట్టు నాటకమాడాడు. తాను అసలు ఐ బొమ్మ నడుపుతున్నట్లు రుజువేంటి అంటూ రవి పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో ఇద్దరి ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు.


