
ఎన్నో దుర్గమాత ఆలయాలు చూసుంటారు. కచ్చితంగా అక్కడ ఇచ్చే బలులకు నేలంతా రక్తసికమై ఎర్రటి సింధూరలా మారిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆలయంలో రక్తమే చిందించని సాత్విక బలి సమర్పిస్తారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఎన్నేళ్ల నాటిదో తెలిస్తే విస్తుపోతారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ కట్టడం తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. దసరా సదర్భంగా ఈ ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం. ఇది బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ముండేశ్వరి మాతగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం
ఆ పేరు రావడానికి కారణం..
ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకు వారాహి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు.
విచిత్రమైన బలి ..
ఇక అమ్మవారికి సమర్పించే బలి అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇలాంటి బలి ఏ ఆలయంలో కనిపించదు. ముందుగా అమ్మవారికి బలి ఇవ్వదలుచుకున్న మేకను ముండేశ్వరి మాత ముందుకు తీసుకువస్తారు. దాని మెడలో ఒక పూల దండ వేయగానే ఏదో మూర్చ వచ్చినట్లు పడిపోతుంది. కాసేపటికి పూజారి ఏవో మంత్రాలు చదువుతూ బియ్యం గింజలు వేయగానే తిరిగి ఆ మేక యథాస్థితిలోకి వస్తుంది.
దాన్ని తిరిగి భక్తుడికి ఇచ్చేస్తాడు పూజారి. ఇక్కడ అమ్మవారికి రక్తం చిందించని, ప్రాణం తీయని సాత్విక పద్ధతిలో బలిని ఇవ్వడమే ఈ ఆలయం విశిష్టత. ఈ అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులుచేత నీరాజనాలు అందుకుంటోంది.
(చదవండి: శ్రీలంక టూర్..బౌద్ధ రామాయణం)