సకీబ్- వైభవ్ (PC: PTI)
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుతం జరిగింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో (వన్డే) అత్యధికస్కోరు సాధించిన జట్టుగా బిహార్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 574 పరుగులు సాధించి ఈ ఫీట్ అందుకుంది.
విధ్వంసకర సెంచరీలు
చాలా సందర్భాల్లో టెస్టు ఇన్నింగ్స్‌లోనూ సాధ్యంకాని రీతిలో ఈ మేరు అత్యంత భారీ స్కోరు సాధించి.. బిహార్ సరికొత్త చరిత్ర లిఖించింది. కెప్టెన్ సకీబుల్ గనీ, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన విధ్వంసకర శతకాల కారణంగానే ఇది సాధ్యమైంది.
రాంచి వేదికగా టాస్ గెలిచిన బిహార్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో మంగళ్ మహ్‌రౌర్ (33) ఫర్వాలేదనిపించగా.. వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 15 సిక్స్‌ల సాయంతో 190 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్సయ్యాడు.
ఆ ఇద్దరూ శతొక్కొట్టేశారు!
వన్‌డౌన్లో వచ్చిన పీయూశ్ సింగ్ సైతం అర్ధ శతకం (77)తో మెరవగా.. నాలుగో స్థానంలో ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆయుశ్ లొహరుకా అద్భుత శతకం (56 బంతుల్లో 116) సాధించాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన కెప్టెన్ సకీబుల్ గని కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టి.. వైభవ్ రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు బాదిన గని.. 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో బిపిన్ సౌరభ్ (1), ఆకాశ్ రాజ్ (8) విఫలం కాగా.. సూరజ్ కశ్యప్ మూడు పరుగులతో.. గనీతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో బిహార్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 574 పరుగులు స్కోరు చేసింది.
ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు
కాగా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతకు ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్లో తమిళనాడు జట్టు.. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే రెండు వికెట్ల నష్టానికి 506 పరుగులు సాధించింది. తాజాగా వరల్డ్ రికార్డును బిహార్ తిరగరాసింది.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు
👉బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6
👉తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2
👉ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4
👉సర్రే- గ్లౌసెస్టర్‌షైర్ మీద 2007లో 496/4
👉ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6.
చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం


