భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్-ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ బుధవారం మొదలైంది.
ప్లేట్ గ్రూపులో భాగంగా.. రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బిహార్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో మంగళ్ మహ్‌రౌర్ 43 బంతుల్లో 33 పరుగులు చేసి నిష్క్రమించగా.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు
ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయి అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. పద్నాలుగేళ్ల 272 రోజుల వయసులో వైభవ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century)ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ కోరే ఆండర్సన్, గ్రాహమ్ రోస్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇక ఈ లిస్టులో జేక్ ఫ్రేజర్ మెగర్క్ (29 బంతుల్లో 125), ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో 149), అన్మోల్‌ప్రీత్ సింగ్ (35 బంతుల్లో 115*) వైభవ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో.. పంజాబీ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ తర్వాత రెండో ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు
ఇక సెంచరీ తర్వాత కూడా తన జోరును కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో 64 బంతుల్లోనే 150 పరుగులు చేసిన సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ బద్దలు కొట్టాడు.
డబుల్ సెంచరీ మిస్
డబుల్ సెంచరీ మిస్ దిశగా దూసుకువెళ్లిన వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. టెచి నెరి బౌలింగ్‌లో షాట్ ఆడే క్రమంలో టెచి డోరియాకు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో84 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 16 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 190 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచాడు. ఇక 30 ఓవర్లలో బిహార్ రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 282 పరుగులు సాధించింది.


